వేసవికాలంలో ఎండలు మండిపోతుండటంతో శరీరానికి తగిన నీటి శాతం అందించడం చాలా అవసరం. అధిక వేడి కారణంగా డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి, నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా దోసకాయ, క్యారెట్, ద్రాక్ష, తర్బూజ, మస్క్‌మెలన్ వంటి పళ్లను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

పానీయాలు, ధూమపానం వంటి అలవాట్లు తగ్గించుకోండి
అలాగే, మద్యం, కాఫీ, టీ వంటి డీహైడ్రేట్ చేసే పానీయాలు, ధూమపానం వంటి అలవాట్లను తగ్గించడం వల్ల శరీరాన్ని కాపాడుకోవచ్చు. మసాలా పదార్థాలు ఎక్కువగా ఉండే వంటకాలు తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రబుల్ వంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వేసవిలో చికెన్, మటన్ వంటి నాన్వెజ్ పదార్థాలను మితంగా తీసుకోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.
రోజుకు రెండు సార్లు స్నానం
శరీరం వేడిని సులభంగా తట్టుకునేందుకు రోజుకు రెండు సార్లు స్నానం చేయడం వల్ల చెమట ద్వారా వచ్చే ఫంగస్ సమస్యలు తగ్గుతాయి. వీటితో పాటు పలుచటి వాతావరణంలో ఉండటం, డైరెక్ట్ ఎండలో తిరగకపోవడం వంటి జాగ్రత్తలు కూడా పాటించాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ కాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిని ఆరోగ్యంగా గడపాలంటే ఈ సూచనలు పాటించడం అత్యంత అవసరం.