దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వక్ఫ్(సవరణ) బిల్లు-2025కు లోక్ సభ ఆమోదం తెలిపింది. సుమారు 14 గంటలకు పైగా లోక్ సభలో చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చ తర్వాత వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించింది. విమర్శలు, ప్రతి విమర్శలతో సభ మార్మోగింది. బిల్లుకు అనుకూలంగా 288మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. ఇక ఇవాళ రాజ్యసభలో బిల్లుపై చర్చ జరగనుంది.
బిల్లు వక్ఫ్ బోర్డు దేశానికి ప్రమాదమా..?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వక్ఫ్ బిల్లుపై చర్చ జరుగుతోంది. ధార్మిక ప్రయోజనాల కోసం ముస్లింలు దేవుడి పేరుమీద ఇచ్చిన ఆస్తుల నిర్వహణ కోసం వక్ఫ్ చట్టం, 1995 ద్వారా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటైంది. ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. అయితే కాలక్రమేణా ఈ బోర్డుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సంస్కరణలు చేయాలని ముస్లిం సంఘాలనుంచి కూడా డిమాండ్స్ వినపడ్డాయి. దీంతో వక్ఫ్(సవరణ) బిల్లు-2024ను కేంద్రం తీసుకొచ్చింది.

ముస్లింలు ధార్మిక ప్రయోజనాల కోసం..
ముస్లింలు ధార్మిక ప్రయోజనాల కోసం, మతపరమైన ప్రయోజనాల కోసం, దేవుని కోసం భూములను, ఆస్తులను శాశ్వతంగా ఇస్తారు. వక్ఫ్ కు ఇచ్చాక మళ్లీ తిరిగి తీసుకోవడానికి వీళ్లేదు. ప్రస్తుతం ఆర్మీ, రైల్వేల తర్వాత భారీ స్థాయిలో భూములు ఉన్నది వక్ఫ్ బోర్డుకు మాత్రమే. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు వద్ద రూ. 8,70,000 స్థిరాస్థులు, 16,173 చరాస్థులు, 3,56,031 ఎస్టేట్ లు ఉన్నాయి. ఈ ఎస్టేట్లు దాదాపు 8 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. ఈ ఆస్తులను పర్యవేక్షించడానికి ప్రతి రాష్ట్రంలో బోర్డులు ఉంటాయి.
అనేక విషయాలపై ప్రభుత్వానికి నియంత్రణ అధికారం
కొత్త వక్ఫ్ బిల్లులో ఏముంది..? వక్ఫ్(సవరణ) బిల్లు-2025 బిల్లులో తీసుకొచ్చిన సవరణల ప్రకారం ఈ బిల్లు పేరు మార్చేశారు. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్ మెంట్ ఎంపవర్ మెంట్ ఎఫీషియన్సీ అండ్ డెవెలప్ మెంట్ బిల్ గా మార్చారు. ప్రస్తుతం వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదు. కానీ ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన అనేక విషయాలపై ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది. ఇన్ని రోజులు వక్ఫ్ ఆస్తుల వివాదాల పరిష్కారాలకు ప్రభుత్వాలకు అధికారం లేదు. కానీ ఇప్పటి నుంచి ఆ అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది.

మహిళలకు అవకాశం
అలాగే ప్రస్తుతం వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు ప్రవేశం ఉండేది కాదు. కానీ ఈ బిల్లు ఆమోదం అనంతరం మహిళలకు అవకాశం కల్పిస్తారు. అంతేకాక ఇప్పటివరకు ముస్లింలలో కొన్ని వర్గాలకు ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు ముస్లింలలో అన్ని వర్గలకూ ఛాన్స్ ఉంటుంది. ఇంతకుముందు ఆస్తి వివాదాల్లో వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయం ఫైనల్ గా ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నియమించే అధికారి నిర్ణయమే ఫైనల్ గా ఉంటుంది. ప్రస్తుతం వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులై శాశ్వతంగా ఉండేవి. కానీ బిల్లు ఆమోదం తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను హైకోర్టులో సవాల్ చేయవచ్చు. ప్రస్తుతం డాక్యుమెంట్స్ లేకున్నా మతపరమైన కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని వక్ఫ్ భూమిగా పరిగణించేవాళ్లు.. కానీ ఇప్పుడు ఆ నిబంధనను తొలగించారు. వక్ఫ్ బిల్లు వివాదమెందుకు..? వక్ఫ్ బిల్లును ప్రతిపక్షాలు, కొన్ని ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
భవిష్యత్తులో ప్రైవేటీకరణకి దారి?
కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను భవిష్యత్తులో ప్రైవేటీకరణ చేయడానికి దారి తీస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ముస్లిం మత పెద్దలు, ఇతర మతపరమైన వ్యక్తులు కూడా ఈ బిల్లుకు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదని.. వక్ఫ్ భూముల పరిరక్షణ, ఆక్రమణల నియంత్రణ కోసమే తీసుకొస్తున్నచట్టం అని చెబుతోంది. వక్ఫ్ బోర్డులపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అవినీతి పెరుగుతోందని.. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ప్రభుత్వ వాదన. వక్ఫ్ బోర్డు పనితీరు మెరుగుపరిచేందుకు మరింత పారదర్శకత అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
విస్తృత అధికారాలను ఈ సెక్షన్ కు కట్టబెట్టిన కోర్టు
వక్ఫ్ బిల్లు- 2024 సవరణలు పరిశీలిస్తే.. 1995 నాటి వక్ఫ్ చట్టంలో సెక్షన్-40ను తొలగించాలని ప్రతిపాదన తెచ్చింది. ఏదైనా ఒక ఆస్తి వక్ఫ్ బోర్డుదా కాదా అని ఈ సెక్షన్ నిర్ణయిస్తుంది. కోర్టు విస్తృత అధికారాలను ఈ సెక్షన్ కు కట్టబెట్టింది. ఏదైనా ఆస్తికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయాలని ఈ బిల్లు సూచిస్తుంది. దీంతో ఆస్తిని అసెస్ మెంట్ చేయవచ్చని బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.