అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా చనిపోయిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఆయన మృతికి గల కారణం తెలిసింది. మారడోనా వేదనతో మరణించి ఉంటాడని పోస్టుమార్టంలో పాల్గొన్న ఒక నిపుణుడు తెలిపారు. మారడోనా మృతి నేపథ్యంలో ఏడుగురు వైద్య నిపుణులు హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ వైద్యుడు డాక్టర్ మౌరిసియో కాసినెల్లి విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారు. గుండె వైఫల్యం, కాలేయ సిరోసిస్ కారణంగా మారడోనా మరణానికి ముందు కనీసం పది రోజులు ఆయన ఊపిరితిత్తుల్లో నీరు పేరుకుపోయిందని పేర్కొన్నారు. మారడోనా బాగోగులు చూసుకున్న నర్సులు, వైద్యులు ఈ విషయాన్ని గమనించి ఉండాలని న్యాయమూర్తులకు తెలిపారు.

గుండె సాధారణం కన్నా రెండింతలు బరువు
మారడోనా గుండె సాధారణం కన్నా రెండింతలు బరువు ఉందని డాక్టర్ మౌరిసియో పేర్కొన్నారు. మరణానికి కనీసం 12 గంటల ముందు ఆయన వేదన అనుభవించి ఉంటాడని వివరించారు. మెదడులో రక్తం గడ్డకట్టుకుపోవడంతో చేసిన ఆపరేషన్ నుంచి కోలుకుంటున్న మారడోనా నవంబర్ 25, 2020న 60 ఏళ్ల వయసులో బ్యూనస్ ఎయిర్‌లోని అద్దె ఇంట్లో మరణించాడు. మారడోనా కొన్ని దశాబ్దాలపాటు కొకైన్, ఆల్కహాల్ వ్యసనంతో బాధపడ్డాడు.
నిర్లక్ష్యం వహించారంటూ ఏడుగురు వైద్యులు ఆరోపణలు
మారడోనా చివరి రోజుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఏడుగురు వైద్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఆరోపణలు నిజమని తేలితే వారికి 8 నుంచి 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మారడోనా గుండె ఆగిపోవడం, ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోయే పరిస్థితి (పల్మనరీ ఎడెమా) కారణంగా మరణించినట్టు గుర్తించారు.