కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. ఓర్వకల్లు మండలం పూడిచర్లలో ఆయన పంట కుంట నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పవన్ తెలిపారు. ప్రతి ఒక్కదానికి ఇన్‌లెట్, అవుట్‌లెట్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు సేద్యంతో పాటు వాటి చుట్టూ కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచేలా రూపకల్పన చేసినట్లు వివరించారు.

రైతులకు దీర్ఘకాలిక ఆదాయం
నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. నీటిని నిల్వచేసుకోగలిగితే ఎలాంటి సమస్య ఉండదు. వర్షాలు రాగానే పంట కుంటలు నిండేలా ప్రణాళికలు చేశాం. 1.55 లక్షల పంట కుంటలు నిండితే మనకు ఇబ్బంది ఉండదు. వీటి చుట్టూ అరటి, నిమ్మ, దానిమ్మ వంటి మొక్కలు పెంచితే రైతులకు దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది. బాతులు, చేపల పెంపకానికి కూడా దోహదం చేస్తుంది.
ఉపాధి హామీ కింద సొంత గ్రామాల్లోనే పనులు
గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదని పవన్ విమర్శించారు. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. ఉపాధి హామీ కింద సొంత గ్రామాల్లోనే పనులు కల్పించామని చెప్పారు. ప్రజలకు ఉపాధి ఆర్థిక స్థిరత్వం కల్పించాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. వంద మందికిపైగా నివసిస్తున్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించినట్లు వివరించారు.
“గెలుపులోనే మనుషులను లెక్కించమని కష్టసమయంలో ఎలా ఉన్నారనే చూస్తాం. కష్టసమయంలో బలంగా నిలబడినందునే విజయం సాధించాం.
ఉపాధి హామీ పథకం బకాయిలు త్వరలో విడుదల
‘జాతీయ ఉపాధి హామీని రాజకీయ కూలీల ఉపాధిగా మార్చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం చాలా గొప్ప పథకం. ఉపాధి లేని వారికి జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి కల్పిస్తోంది. నాకు ఉపాధి అవసరమైనప్పుడు నేను కూడా నరేగా ద్వారా పనిచేస్తా అన్నారు పవన్ కల్యాణ్.