ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌లో వెలుగుచూసిన మర్చంట్ నేవీ అధికారి హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు ముస్కాన్, తన భర్త సంపాదించిన డబ్బులను ప్రియుడికి ఇచ్చి బెట్టింగ్ ఆడించినట్లు తెలుస్తోంది. వచ్చిన డబ్బుతోనే వీరిద్దరూ విహారయాత్రను వెళ్లినట్లు సమాచారం.

అవసరాల కోసం ప్రతినెలా రూ.లక్ష
విదేశాల్లో ఉంటున్న సౌరభ్- తన భార్య, కుమార్తె అవసరాల కోసం ప్రతినెలా రూ.లక్ష చొప్పున పంపించేవాడని దర్యాప్తులో తేలింది. ఆ డబ్బులు తన అకౌంట్‌లో పడగానే ముస్కాన్, తమ ప్రియుడికి చెప్పేదని, వాటితోనే సాహిల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ పెట్టేవాడని పోలీసువర్గాలు తెలిపాయి. బెట్టింగ్‌లో వచ్చిన డబ్బుతో వీరిద్దరూ రిషికేశ్, దెహ్రాదూన్ వంటి ప్రాంతాలకు ట్రిప్‌లకు వెళ్లినట్లు తెలిసింది. సాహిల్‌కు ఎలాంటి ఉద్యోగం లేదని, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లో వచ్చిన డబ్బులతోనే జల్సాలు చేసేవాడని స్థానికులు చెబుతున్నారు.
మందుల చీటీని ఫోర్జరీ చేసి నిద్రమాత్రలు
అంతేకాకుండా సౌరభ్‌ను హత్య చేసేందుకు ముస్కాన్ పక్కాగా ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం మందుల చీటీని ఫోర్జరీ చేసి నిద్రమాత్రలు సంపాదించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ‘ఫిబ్రవరి 22న ముస్కాన్ స్థానికంగా ఉన్న ఓ వైద్యుడి వద్దకు వెళ్లి, ఆందోళన సమస్యతో బాధపడుతున్నానని చెప్పి మందులు రాయించుకుంది. ఆ తర్వాత ఓ ఖాళీ ప్రిస్క్రిప్షన్ పేపర్‌ను కూడా సంపాదించింది. అందులోనే ముస్కాన్ ఇచ్చిన మందులు రాసింది. వాటితో పాటు ఆన్లైన్లో నిద్ర మాత్రల గురించి వెతికి ఆ పేర్లను కూడా రాసింది. ప్లాన్ ప్రకారం ఫిబ్రవరి 25నే అతడిని హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత మార్చి 4న అతడికి నిద్ర మాత్రలు ఇచ్చి ప్రియుడితో కలిసి అతి దారుణంగా హత్య చేసింది’ అని పోలీసు వర్గాలు తెలిపాయి.
విడాకుల వరకు వెళ్లిన సౌరభ్
సౌరభ్ రాజ్‌పుత్, ముస్కాన్ 2016లో ప్రేమవివాహం చేసుకున్నారు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ముస్కాన్‌కు సాహిల్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ విషయం తెలుసుకున్న సౌరభ్ విడాకుల వరకు వెళ్లారు. కానీ కుమార్తె భవిష్యత్తు కోసం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన సౌరభ్ గతనెల కుమార్తె పుట్టినరోజు కోసం మేరఠ్‌కు తిరిగొచ్చాడు. అడ్డు తొలగించుకోవాలని భావించిన ముస్కాన్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం వేసింది. శవాన్ని 15 ముక్కలుగా చేసి ప్లాస్టిక్ డ్రమ్‌లో వేసి సిమెంట్‌తో కప్పిపెట్టింది.