నేడు మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. కిటకిటలాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ఆలయాల ముందు బారులు తీరి నిల్చున్నారు భక్తులు. తెల్లవారు జామునాటి మొదటి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరమశివుడిని దర్శించుకుంటోన్నారు. అటు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభ మేళాకు నేడు చివరి రోజు. నేటితో కుంభమేళాకు తెర పడబోతోంది. చివరి రోజు కావడంతో పుణ్యస్నానాలను ఆచరించడానికి భక్తులు పోటెత్తుతున్నారు. లక్షల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచీ వస్తోన్న భక్తులతో ఈ సిటీ క్రిక్కిరిసిపోతోంది.

అమృత్ స్నాన పర్వదినం
మహా శివరాత్రి నాడు కుంభమేళాలో పుణ్యస్నానాలను ఆచరించడానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దీన్ని అమృత్ స్నాన్‌గా పరిగణిస్తారు. మకర సంక్రాంతి తొలి అమృత్ స్నాన పర్వదినం. దీని తరువాత మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘి పూర్ణిమల్లో కోట్లాదిమంది అమృత్ స్నాన్ ఆచరించారు. చివరిగా మహా శివరాత్రి నాటి అమృత్ స్నాన్ ఆచరించడానికి కోట్లాదిమంది ప్రయాగ్‌రాజ్‌కు వస్తోన్నారు. ఇప్పటికే పుణ్యస్నానాలను ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లను దాటింది కూడా. మంగళవారం నాటికి 65 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. భ
ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. గోరఖ్‌పూర్ ఆలయంలో ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. ఈ తెల్లవారు జామునే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంట్రోల్ రూమ్‌కు వచ్చారు. మహా కుంభమేళా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా త్రివేణి సంగమం ఘాట్ల వద్ద పోలీస్ క్రౌడ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. అశ్వదళాలను మోహరింపజేశారు. ఘాట్ల వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. మరోవంక వారణాశిలోని కాశీ విశ్వనాథేశ్వరుడి ఆలయానికీ లక్షల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తోన్నారు.