తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారి టికెట్ల జారీకి ముందు జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ సంఘటనపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిందని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంతో.. వేరే విచారణ అవసరం లేదని హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ జరపాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టివేసింది. ఇక ఇదే అంశంపై ఈ రోజు మరో పిల్ దాఖలు చేసింది. దీనిని సైతం హైకోర్టు కొట్టివేసింది. టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సీబీఐ విచారణ జరపాలంటూ.. కర్నూలుకు చెందిన ప్రభాకర్ రెడ్డి ఏపీ హైకోర్టులో గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.

కేసు పూర్తి వివరాలు
ఇంతకీ ఏం జరిగిందంటే.. 2025, జనవరి 10వ తేదీ ముక్కోటి ఏకాదశి. ఈ నేపథ్యంలో తిరుమలలో 10 రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఆ క్రమంలో జనవరి 9వ తేదీ తెల్లవారుజాము నుంచి టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ప్రకటించింది. అందుకోసం తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాల్లో 94 టోకెన్ జారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పిల్లాపాపలతో సహా భారీగా తిరుపతికి వచ్చి చేరుకున్నారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం
అయితే బైరాగి పట్టెడ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో సిబ్బంది ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించేందుకు క్యూ లైన్ గేట్‌ను తెరిచారు. టోకెన్లు జారీ చేసేందుకు క్యూలైన్లు తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా తోసుకురావడంతో ఈ తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.