ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఇదిలా ఉండగా.. ఆదివారం దక్షిణా గాజా ప్రాంతంలో రాత్రిపూట ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ సీనియర్ నాయకుడు సహా కనీసం 26 మంది పాలస్తీనియన్లు మరణించారు. కొత్త తరలింపు ఆదేశాలను అనుసరించి వేలాది మంది పాలస్తీనియన్లు పారిపోవడంతో ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ నగరమైన రఫాలోని ఒక ప్రాంతానికి కూడా దళాలను పంపింది. రఫా నగరాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ఆదేశించింది.

మరణించిన వారిలో 15 మంది పిల్లలే
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 50 వేల మంది మరణించగా.. ఇప్పటివరకు 1,13,000 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత వారం కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ ఆకస్మిక వైమానిక దాడుల్లో 673 మంది మరణించినట్లు ఆదివారం మంత్రిత్వ శాఖ పంచుకున్న గణాంకాలు చెబుతున్నాయి.
మృతుల్లో 15, 613 మంది పిల్లలు ఉన్నారని.. వారిలో 872 మంది ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్నవారని మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మునీర్ అల్-బోర్ష్ తెలిపారు. దక్షిణ గాజా ప్రాంతంలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ అగ్రనేతతో సహా కనీసం 26 మంది పాలస్తీనియన్లు మరణించారని అధికారులు వెల్లడించారు.
హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ పై క్షిపణి
ఇంతలో యెమెన్ లో ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ పై మరో క్షిపణిని ప్రయోగించారు. ఇది వైమానిక దాడుల సైరన్‌లను ప్రేరేపించింది. క్షిపణిని గాల్లోనే కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపిందియ ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. ఖాన్ యూనిస్ సమీపంలో జరిగిన దాడిలో తమ రాజకీయ బ్యూరో సభ్యుడు,పాలస్తీనా పార్లమెంటు సభ్యుడు సలా బర్దావిల్, ఆయన భార్య మరణించారని హమాస్ తెలిపింది.