ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ(Justice Yashwant Varma) అధికారిక నివాసంలో భారీ మొత్తంలో కాలిపోయిన కరెన్సీ నోట్లు బయటపడిన ఘటన వాస్తవమేనని సుప్రీంకోర్టు(Suprem Court) నియమించిన త్రిసభ్య విచారణ కమిటీ తేల్చిచెప్పింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి 60 పేజీల సంచలన నివేదికను సమర్పించింది. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయి, ఎలాంటి విధులు కేటాయించబడని జస్టిస్ వర్మను తక్షణమే విధుల నుంచి తొలగించాలని కమిటీ బలంగా సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 14న ఢిల్లీలోని తుగ్లక్ క్రెసెంట్ రోడ్డులోని జస్టిస్ వర్మ అధికారిక బంగళాలోని స్టోర్‌రూమ్(Store Room)లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఈ నోట్ల కట్టలు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. ఆ స్టోర్‌రూమ్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జస్టిస్ వర్మ లేదా ఆయన కుటుంబ సభ్యుల నియంత్రణలోనే ఉండేదని, ఇందుకు తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని కమిటీ స్పష్టం చేసింది. మార్చి 15వ తేదీ తెల్లవారుజామున ప్రమాదంలో దగ్ధమైన నోట్లను అక్కడి నుంచి తొలగించడమే దీనికి ప్రధాన సాక్ష్యమని పేర్కొంది. అంత పెద్ద మొత్తంలో నగదును నివాసంలో ఉంచడం అత్యంత అనుమానాస్పదమని కమిటీ వ్యాఖ్యానించింది.

వర్మ కుమార్తె, ఆయన వ్యక్తిగత కార్యదర్శి లను కూడా విచారించారు
పది రోజుల పాటు 55 మంది సాక్షులను విచారించిన కమిటీ, వారి వాంగ్మూలాలను వీడియో రికార్డింగ్ చేసింది. “గదిలో నేలపై భారీగా రూ.500 నోట్ల కట్టలు పడి ఉన్నాయి. నా జీవితంలో అంత డబ్బు చూడలేదు” అని ఓ కీలక సాక్షి చెప్పినట్లు తెలిసింది. జస్టిస్ వర్మ కుమార్తె, ఆయన వ్యక్తిగత కార్యదర్శి రాజేందర్ సింగ్‌ను కూడా విచారించారు. కాలిపోయిన నోట్ల వివరాలను అగ్నిమాపక సిబ్బంది నమోదు చేయకుండా రాజేందర్ సింగ్ అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఘటన వెలుగు చూసిన తర్వాత, మార్చి 28న సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది.
Read Also: Income Tax Raids: మాజీ మంత్రి అక్రమ ఆర్జనపై ఐటీ సోదాలు .. 20 చోట్ల తనిఖీలు