రాష్ట్రవ్యాప్తంగా గత పది రోజులుగా తగ్గుముఖం పట్టిన ఎండలు మళ్లీ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. రెండు రోజులుగా కాస్తున్న ఎండలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే రోడ్లపై జనాలు కూడా కనిపించడం లేదు. ఇళ్లలోనే సేద తీరుతూ ఉక్కపోతకు అల్లాడుతున్నారు. రెండు రోజులూ హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉంటున్నప్పటికీ, ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 41.0 డిగ్రీల సెల్సియస్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గుర్రంపోడులో నమోదైంది.

మూడు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి పెరిగే అవకాశం
గురువారం హైదరాబాద్ నగరంలో నాచారం, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, కాప్రా, యూసుఫ్‌గూడ, బేగంపేట ప్రాంతాల్లో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అలాగే రాజేంద్రనగర్, గాజులరామారంలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాబోయే మూడు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
ఉమ్మడి నల్లొండ జిల్లాల్లో 36 ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్
అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా గుర్రంపోడులో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 41.0 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది. మరోవైపు నల్గొండ జిల్లాలో 36 ప్రాంతాల్లో ఆరెంజ్ హెచ్చరిక స్థాయిలో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఏడు ప్రాంతాల్లో రాష్ట్రంలోనే రెండో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుయ్యాయి. ఇందులో సూర్యాపేట జిల్లాలో 11 ప్రాంతాలు, యాదాద్రి జిల్లాలో 10 ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు రాబోయే మూడు రోజులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా ఇలానే ఉన్నాయి. జనాలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు.