తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ కేసు వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు కేటీఆర్‌లపై చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి.
Congress CWC meeting : కాంగ్రెస్ CWC కీలక సమావేశం ఖర్గే అధ్యక్షతన హై లెవల్ చర్చలు
గతంలో వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో కీలక సాక్ష్యాలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టిందని బండి సంజయ్ ఆరోపించారు. అప్పట్లో పట్టుబడిన సెలబ్రిటీలు మరియు ఇతర నిందితులు కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారని ఆయన విమర్శించారు. నాటి సిట్ (SIT) చీఫ్ అకున్ సబర్వాల్ అన్ని ఆధారాలతో, ఆడియో మరియు వీడియో సాక్ష్యాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారని, కానీ కేటీఆర్ రాజకీయ భవిష్యత్తును కాపాడటం కోసం కేసీఆర్ ఆ నివేదికను బయటకు రాకుండా అడ్డుకున్నారని సంజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సోమేష్ కుమార్ పాత్రపై బండి సంజయ్ తీవ్రమైన ప్రశ్నలు సంధించారు. అకున్ సబర్వాల్ సమర్పించిన నివేదిక సోమేష్ కుమార్ చేతుల్లోకి వెళ్ళాక ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఆ నివేదికను మాయం చేయడం లేదా మార్చడం వెనుక ఉన్న శక్తులెవరో తెలియాలంటే సోమేష్ కుమార్‌ను వెంటనే విచారించాలని డిమాండ్ చేశారు. కీలకమైన ఆధారాలు ఉన్న ఫైళ్లను తారుమారు చేయడం నేరమని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం ఈ కేసును మళ్లీ మొదటి నుంచి విచారించాలని బండి సంజయ్ కోరారు. ముఖ్యంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసిన అకున్ సబర్వాల్‌కే మళ్లీ ఈ కేసు బాధ్యతలను అప్పగించాలని ఆయన సూచించారు. రాజకీయ పలుకుబడితో కేసుల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని, చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన అన్నారు. ఈ కేసును తిరిగి తోడటం ద్వారా డ్రగ్స్ మాఫియాతో రాజకీయ నాయకులకు ఉన్న సంబంధాలను బయటపెట్టాలని, తద్వారా రాష్ట్రంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఆయన ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com