తెలంగాణ శాసనసభలో కృష్ణా నదీ జలాల పంపిణీపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సభకు వచ్చి ఉంటే ఈ అంశాలపై నేరుగా ప్రశ్నించేవాడినని పేర్కొన్న రేవంత్ రెడ్డి, “కేసీఆర్ ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేశారా? లేక ఎవరైనా అధికారులు ఆయనను తప్పుదోవ పట్టించారా?” అని సందేహం వ్యక్తం చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి కీలక ప్రాజెక్టులపై రాష్ట్ర హక్కులను కాపాడటంలో గత పాలకులు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.

నదీ జలాల విషయంలో కేవలం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తోనే కాకుండా, ఎగువన ఉన్న కర్ణాటకతోనూ సవాళ్లు ఎదురవుతున్నాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కృష్ణా నదిపై కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా కర్ణాటక నుంచి రావాల్సిన నీటి వాటా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో న్యాయపరమైన మరియు రాజకీయపరమైన పోరాటానికి సిద్ధంగా ఉండాలని సభకు వివరించారు.
AP: స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ చేసిన రవి నాయుడు
తెలుగు రాష్ట్రాల మధ్య (తెలంగాణ, ఏపీ) నీటి పంపిణీ విషయంలో చిన్నపాటి భేదాభిప్రాయాలు, పంచాయితీలు ఉన్నప్పటికీ, ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్ణాటక వంటి రాష్ట్రాలపై పోరాడాల్సిన సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని, అప్పుడే కృష్ణా నదిపై తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించుకోగలమని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com