114 కాలేజీల్లో అందుబాటులో 28,590 సీట్లు
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో (polytechnic colleges) ఇంజనీరింగ్ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్-2025 కౌన్సెలింగ్లో భాగంగా నేడు (శుక్రవారం) సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యే నాటికి 21,316 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 15,691 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. పాలీసెట్-2025 కౌన్సెలింగ్లో భాగంగా జూన్ 24 నుంచి 28 వరకు పాలీసెట్లో అర్హత సాధించిన విద్యార్థులు తమ వివరాలను అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

నేటి నుండి సీట్ల కేటాయింపు
జూన్ 26 నుంచి 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషనను చేపట్టారు. వెబ్ ఆప్షన్లను ఇచ్చిన వారికి నేడు సీట్ల కేటాయింపు (Seat allocation) చేపట్టనున్నారు. రాష్ట్రంలో 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 14,280 సీట్లు అందుబాటులో ఉండగా 55 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 14,310 సీట్లు ఉన్నాయి. మొత్తం 114 పాలిటెక్నిక్ కాలేజీల్లో 28,590 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా కేసముద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రారంభం కానుండగా అందులో నాలుగు కోర్సుల్లో 240 సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే పటాన్చెర్వులో మరో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మూడు కోర్సుల్లో 180 సీట్లను అందుబాటులోకి తెచ్చారు.
గత ఏడాది 57 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా.. ఈ ఏడాది రెండు కాలేజీలు మూతపడటంతో 55 కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోనున్నారు. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 6 వరకు ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి అవకాశం కల్పించారు. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ను ఈ నెల 9, 10 తేదిల్లో నిర్వహించనున్నారు. జులై 11న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 11, 12 తేదిల్లో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. వారికి జులై 15లోపు సీట్ల కేటాయింపు చేస్తారు. సీటు పొందిన వారు జులై 15, 16 తేదిల్లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. జులై 15 నుంచి 17 వరకు సీటు పొందిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. జులై 18 లోపు కాలేజీల్లో జాయినింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. జూలై 15 నుంచి అకడమిక్ సెషన్ ను ప్రారంభించ నున్నారు.
Read also: HMDA: రక్షణ శాఖకు 435 ఎకరాల హెచ్ఎండిఎ భూములు
Read hindi also: hindi.vaartha.com