సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఫార్మా పరిశ్రమ(Sigachi Plant Explosion)లో జూన్ 30న చోటుచేసుకున్న రియాక్టర్ పేలుడు ఘటన రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 26 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. అయితే గాయపడిన పలువురు పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. రెస్క్యూ బృందాలు ఇంకా శిథిలాల కింద శోధన కొనసాగిస్తున్నాయి.
700-800 డిగ్రీల టెంపరేచర్ – సజీవ దహనం
పేలుడు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో ఉష్ణోగ్రత 700 నుంచి 800 డిగ్రీల మధ్య ఉండి ఉంటుందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. రియాక్టర్ లోని రసాయనాలు అధిక ఉష్ణోగ్రతతో ఒక్కసారిగా ప్రతిచర్యచేసి ఈ ఘోర ప్రమాదానికి కారణమైనట్టు భావిస్తున్నారు. ఈ తారాస్థాయిలో ఉన్న ఉష్ణోగ్రత వల్ల పలువురు కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. శవాలు పూర్తిగా కాలిపోయినందున DNA పరీక్షల ద్వారానే గుర్తింపు కొనసాగుతోంది.
పక్కనున్న భవనం కుప్పకూలింది – ప్రజల ఆందోళన
పేలుడు ధాటికి పరిశ్రమ సమీపంలో ఉన్న మూడంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. దీంతో మరింత ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండే అవకాశం ఉండటంతో రెస్క్యూ బృందాలు ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. ఈ ఘటనపై పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోందని అధికారులు తెలిపారు.
Read Also : Gas Price : భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర