తెలంగాణ (Telangana) లో ప్రజలను వాతావరణ శాఖ ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలతో, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశముండడంతో, వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాల ప్రభావం కనిపించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు:
వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంది. వీటిలో కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది.
భారీ వర్ష సూచన నేపథ్యంలో పైన పేర్కొన్న ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.
ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు:
వాతావరణ శాఖ సూచించిన ప్రకారం, ప్రజలు తమ ప్రాంతీయ వాతావరణ సూచనలను గమనించాలి. విద్యుత్ తీగల దగ్గర ఉండకూడదు. నీటిమడుగులు, చెట్ల క్రింద నిలుచోవడం నివారించాలి. అవసరమైన సేవల కోసం ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు పాటించాలి. ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్‌లు, రెవెన్యూ మరియు పోలీస్ శాఖలు, అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
Read also: Mahesh Kumar Goud: బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంపై మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు స్పందన