Telangana: కొన్ని గ్రామ పంచాయతీల్లో వీధి కుక్కలకు విష ప్రయోగం చేసి చంపినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Sitakka) అన్నారు. సంబంధిత ఘటనలపై ఇప్పటికే పోలీసు కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నారని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. వీధి కుక్కల బెడద ఉందన్న నేపథ్యంలో అమానుషంగా కుక్కలను చంపడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, మానవత్వానికి పూర్తిగా విరుద్ధమని, ఇలాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
Read Also: Urban Forests : తెలంగాణ లో మరో 6 అర్బన్ ఫారెస్ట్ లు

మూగజీవాలను విషం పెట్టి చంపడం
మూగజీవాలను విషం పెట్టి చంపడం వంటి దారుణమైన చర్యలు పూర్తిగా నేరమని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొన్ని గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయనే విషయం స్థానిక సర్పంచుల దృష్టికి రావడం సహజమేనని, అయితే ఆ సమస్యకు పరిష్కారం అనేది చట్టబద్ధమైన, శాస్త్రీయమైన, మానవీ యమైన మార్గాల్లోనే చేయాలి తప్ప అతి దారుణమైన నిర్ణయాలు తీసుకోవడం సమంజనం కాదని హితువు పలికారు.
విష ప్రయోగాలకు తావు లేదు
వీధి కుక్కల నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా టీకాలు, కుటుంబ నియంత్రణ (Sterilization) వంటి శాస్త్రీయ పద్దతులను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. మూకుమ్మడిగా విషం పెట్టి చంపడం వంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
బాధ్యులపై ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా, వీధి కుక్కల వల్ల సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, మానవీయత, చట్టబద్ధత, శాస్త్రీయతే ప్రభుత్వ విధానం అని మంత్రి సీతక్క అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: