జూన్ 2న తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని (Telangana Formation Day) పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth )నేతృత్వంలోని ప్రభుత్వం ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పలు పథకాల అమలు తేదీగా ఫిక్స్ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, రాజీవ్ యువ వికాసం పథకం తొలి విడత నిధుల మంజూరు, మిగిలిన రైతులకు రైతు భరోసా నిధుల విడుదల, ఉద్యోగుల పెండింగ్ డీఏ ప్రకటన వంటి కీలక అంశాలను అదే రోజున ప్రారంభించనుంది.
పట్టాల పంపిణీ, ఉద్యోగ నియామకాలు
అసైన్డ్ భూములపై సాగు చేస్తున్న పేద రైతులకు పట్టాల మంజూరు చేయడం, గ్రామ పాలన అధికారుల అపాయింట్‌మెంట్‌లు ఇవ్వడం వంటి కార్యక్రమాలూ జూన్ 2నే జరుగనున్నాయి. గ్రామీణ పరిపాలన మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ ఆఫీసర్ (జీపీవో) పోస్టుల భర్తీకి ముందడుగు వేసింది. దాదాపు 3,500 మందికి రెవెన్యూ శాఖలో రీఅపాయింట్‌మెంట్ లెటర్లు అందించనున్నట్లు సమాచారం. ఇదే సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై కీలక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు
జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భూ సమస్యల పరిష్కారం, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన వంటి అంశాలపై ఈ సదస్సుల్లో చర్చించి పరిష్కారాలు అందించనున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని మండలాల్లో ఇప్పటికే విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని అధికారులు తెలిపారు. రైతు భరోసా పథకం కింద మే నెలలో ఇవ్వాల్సిన నిధులు జూన్ 3న విడుదల చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలతో పండగ వాతావరణం నెలకొననుంది.
Read Also : Rohit Sharma: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ