తెలంగాణలో వేలాది మంది పేద ప్రజలకు జీవనాధారంగా ఉన్న ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ వైద్య సేవలు నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆస్పత్రులు ఈ నిర్ణయానికి వచ్చాయని వెల్లడించారు.
చెల్లింపులు లేక సేవలు ఆపాలని ఆస్పత్రుల నిర్ణయం
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్ తెలిపిన ప్రకారం, గత ఏడాది నుంచి ఆరోగ్యశ్రీ, 18 నెలలుగా ఈహెచ్‌ఎస్ బిల్లులు (EHS bills)ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆస్పత్రులు ఆర్థికంగా కుదేలయ్యాయి. ఆస్పత్రుల నిర్వహణ ఖర్చులు భరించలేని స్థితికి చేరడంతో వైద్య సేవల బంద్ తప్పనిసరి అయిందని చెప్పారు.

బకాయిల పరిమాణం – వాదనల తేడాలు
ఆస్పత్రుల లెక్కల ప్రకారం ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తాలు ₹1,200 కోట్ల నుంచి ₹1,400 కోట్ల వరకూ ఉన్నాయని పేర్కొంటున్నారు. కానీ ఆరోగ్యశ్రీ (Arogyashri)ట్రస్టు వర్గాలు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రులకు ₹530 కోట్లు, ప్రభుత్వ ఆస్పత్రులకు ₹550 కోట్లు చెల్లించాల్సి ఉందని, మొత్తం బకాయిలు ₹1,100 కోట్లలోపే ఉన్నాయని చెబుతున్నాయి.
సమస్య పరిష్కారానికి విఫలయత్నాలు
గత నెల (ఆగస్టు 21)న ఆస్పత్రులు సెప్టెంబర్ 1 నుంచి సేవలు నిలిపేస్తామని ప్రభుత్వంకు లేఖ రాశాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆగస్టు 30న చర్చలు జరిపింది. కొంత మొత్తాన్ని విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఆస్పత్రులు తమ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినప్పటికీ, 15 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి చర్యలు లేకపోవడంతో ఇప్పుడు సేవల నిలిపివేతను అమలు చేస్తున్నారు.
₹100 కోట్లు విడుదల..
సెప్టెంబర్ 15న ఆరోగ్యశ్రీ ట్రస్టు కొన్ని ఆస్పత్రులకు ₹100 కోట్లను విడుదల చేసింది. కానీ ఆసుపత్రుల యాజమాన్యాల అభిప్రాయం ప్రకారం, ఇది పేరుకుపోయిన బకాయిల ముందు చాలా తక్కువ. అందువల్ల మొదట ప్రకటించిన నిర్ణయానికే ఆసుపత్రులు కట్టుబడి ఉన్నాయని తేల్చి చెప్పాయి.
పేద రోగుల ఆందోళన –
ఈ పరిణామాలతో వేలాది మంది ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు గందరగోళానికి లోనవుతున్నారు. అత్యవసర చికిత్సలు, సర్జరీలు, మరియు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారు ఏం చేయాలన్న భయంతో ఉన్నారు. ప్రభుత్వ వైద్య సేవలు సరిపోని సందర్భాల్లో, ప్రైవేట్ ఆసుపత్రులే ఆశ్రయం కావడంతో ఇప్పుడు వారి పరిస్థితి మరింత విషమంగా మారింది.
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ సేవలు ఎందుకు బంద్ అవుతున్నాయి?
ప్రభుత్వం ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్‌ఎస్ పథకాల కింద ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో, నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆర్థికంగా కుదేలై ఈ సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: