సికింద్రాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చిన కొన్ని రోజులకే, హైదరాబాద్ శివారు పేట్–బషీరాబాద్ (Pet-Bashirabad)లో మరో సరోగసీ (Surrogate) ముఠా బట్టబయలైంది. ఈ దందాలో అండాలు సేకరణతో పాటు అద్దె గర్భం వ్యవహారాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి, ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పిల్లలేని దంపతుల ఆశలను వేటాడిన ముఠా
పిల్లలు లేని దంపతుల ఆశలను కొందరు నేరస్తులు డబ్బు కోసం వినియోగించుకుంటున్నారు. ఇదే తరహాలో నమ్రత అండ్ కో అనే గ్యాంగ్ గతంలో అక్రమ శిశు విక్రయాల కేసులో జైలుపాలైంది. ఇప్పుడు మేడ్చల్ (Medchal) ఎస్వోటీ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి పేట్–బషీరాబాద్ పద్మనగర్‌లో జరుగుతున్న మరో రాకెట్‌ను ఆపేశారు.
డబ్బు ఆశతో పేద మహిళల దుర్వినియోగం
ప్రధాన నిందితురాలు లక్ష్మీరెడ్డి, పేదరికంలో ఉన్న మహిళలను గుర్తించి డబ్బు ఆశ జూపేది. సరోగసీ (Surrogate)కి సిద్ధమైతే ₹3–5 లక్షలు ఇస్తానని ఒప్పించి, వారిని తన ఇంట్లో ఉంచి 9 నెలల పాటు సంరక్షించేది. దంపతుల స్థోమతను బట్టి సరోగసీ రేట్లు ₹10 లక్షల నుంచి ₹30 లక్షల వరకు నిర్ణయించేది. పిల్లలు జన్మించిన తర్వాత వారిని ఒప్పంద తల్లిదండ్రులకు అప్పగించి పెద్ద మొత్తంలో లాభం దండించేది.
అండాల అక్రమ సేకరణ – ఆసుపత్రుల అనుమానాస్పద పాత్ర
సరోగసీతో పాటు నిందితులు మహిళల నుంచి అండాలు అక్రమంగా సేకరించి వివిధ ఆసుపత్రులకు సరఫరా చేసినట్టు సమాచారం. మాదాపూర్, సోమాజిగూడ, బంజారాహిల్స్, కొండాపూర్ ప్రాంతాల్లోని పలు ఐవీఎఫ్ సెంటర్లతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది.
పోలీసుల దాడితో బట్టబయలు
విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు లక్ష్మీరెడ్డి ఇంటిపై దాడి చేశారు. అక్కడ ముగ్గురు సరోగసీ గర్భిణులు, ముగ్గురు ఎగ్‌డోనర్లు, నిందితురాలు లక్ష్మీరెడ్డి, ఆమె కుమారుడు నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి, ప్రధాన ఇద్దరిని రిమాండ్‌కు పంపించారు. మిగతా ఆరుగురికి నోటీసులు జారీ చేశారు.
ముంబయి నుంచి హైదరాబాద్‌కు…
పోలీసుల దర్యాప్తులో లక్ష్మీరెడ్డి గతంలో ముంబయిలో కూడా ఇలాంటి అక్రమ సరోగసీ రాకెట్ నడిపినట్లు బయటపడింది. 2024లో ఆమెపై అక్కడ కేసు నమోదు అయ్యి ఇప్పటికీ ట్రయల్ నడుస్తోంది. ముంబయిలో సమస్యలు ఎదుర్కొన్న ఆమె, హైదరాబాద్‌కు వచ్చి అదే దందాను కొనసాగించినట్లు అనుమానిస్తున్నారు.
స్వాధీనం చేసిన ఆధారాలు
సోదాల్లో పోలీసులు భారీ మొత్తంలో ఆధారాలు దొరకాయి. ₹6.47 లక్షల నగదు, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, సిరంజీలు, గర్భధారణ మాత్రలు, హార్మోన్ ఇంజక్షన్లు, 5 మొబైల్ ఫోన్లు, ఆసుపత్రులకు చెందిన కేస్‌షీట్లు స్వాధీనం చేశారు. ఈవా ఐవీఎఫ్, అమూల్య ఐవీఎఫ్, హెగ్డే హాస్పిటల్, శ్రీ ఫెర్టిలిటీ వంటి అనేక సెంటర్లతో సంబంధాలు ఉన్నాయా అన్నది కూడా పోలీసులు విచారిస్తున్నారు.
రాబోయే విచారణలో బయటపడే నిజాలు
ప్రధాన నిందితురాలు కస్టడీ విచారణలో ఉంటే ఇంకా ఎన్నో నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకు ఎన్ని సరోగసీ కేసులు జరిగాయి? ఎంత డబ్బు సంపాదించారు? సరోగసీ పేరుతో అక్రమ శిశువిక్రయాలు జరిగాయా? అన్న ప్రశ్నలకు సమాధానాలు లభించనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: