పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ రహిత సింగరేణి లక్ష్యంగా కఠిన నిబంధనలను అమలు చేయనుంది.ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని తగ్గించేందుకు కంపెనీ తాజా నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా కఠిన నిబంధనలు రూపొందించి, వాటిని అమలు చేయడం మొదలుపెట్టింది.ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day) సందర్భంగా సీఎండీ బలరాం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించగా ఇప్పుడు ఆ ఆలోచనను సింగరేణి విస్తరించి ఉన్న 12 ప్రాంతాల్లోనూ అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. నిబంధనలను ఉల్లంఘించి ప్లాస్టిక్ వినియోగిస్తే రూ.10 వేల జరిమానా విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.
ప్లాస్టిక్ వాడినట్లయితే
సింగరేణిలోని అన్ని అధికారిక కార్యక్రమాలు, కార్యాలయాలు, గనులు, విభాగాలతో పాటు, సింగరేణి ఆధీనంలోని దాదాపు 50 కమ్యూనిటీ హాళ్లు, సామూహిక భవనాలు, క్లబ్‌లు, క్రీడా మైదానాల్లోనూ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించారు. వివిధ శుభకార్యాలకు నామమాత్రపు ఛార్జీతో కేటాయించే ఈ వేదికల్లో ప్లాస్టిక్ వాడినట్లయితే కొత్త నిబంధనల ప్రకారం భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సింగరేణి ఉద్యోగులు, ప్రజలు ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని ఉన్నతాధికారులు తెలిపారు.
ఆహారాన్ని తీసుకెళ్లడానికి
సమావేశాలు, కార్యక్రమాల్లో ప్లాస్టిక్ కప్పులకు బదులుగా పేపర్ కప్పులు, నీటి కోసం స్టీలు లేదా గాజు బాటిళ్లు, స్నాక్స్ కోసం స్టీలు ప్లేట్లు ఉపయోగించాలన్నారు.నిత్యావసరాలకు వస్తువులు తీసుకురావడానికి జనపనార లేదా వస్త్ర సంచులను వాడాలన్నారు. లంచ్ బాక్స్ (Lunch box) ల్లో ఆహారాన్ని తీసుకెళ్లడానికి స్టీలు డబ్బాలను మాత్రమే ఉపయోగించాలన్నారు. సింగరేణి తీసుకున్న ఈ కఠిన నిర్ణయం పర్యావరణ పరిరక్షణకు ఒక మంచి అడుగు అని, ఇది ఇతర సంస్థలకు కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తుందని పర్యావరణవేత్తలు ప్రశంసిస్తున్నారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని సింగరేణి కోరుతోంది.

అవగాహన కార్యక్రమాలు
ప్రజల్లో కూడా ఈ మార్పును ప్రోత్సహించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సింగరేణి పరిధిలోని పాఠశాలలు, కాలనీలు, మార్కెట్లలో ప్లాస్టిక్ తలంపు ఎంత నాశనం చేస్తుందో వివరించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్కూల్ పిల్లల నుంచి ఉద్యోగస్తులు వరకూ అందరికీ ప్లాస్టిక్ పై స్పష్టమైన అవగాహన కల్పించనున్నారు.
తీవ్ర నష్టాన్ని
ప్లాస్టిక్ అనేది ఆధునిక జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది. ఇది పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి తీవ్రమైన అనర్థాలను కలిగిస్తోంది. భూ కాలుష్యం, జల కాలుష్యం, వాయు కాలుష్యంతో పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని (Plastic Use) తగ్గించడం, పునర్వినియోగం చేయడం, ప్రత్యామ్నాయ వస్తువులను వాడటం ద్వారా ఈ అనర్థాలను తగ్గించవచ్చు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించడం మనందరి వ్యక్తిగత బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడాకాన్ని తగ్గించాలి.
Read Also: http://CM Chandrababu: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామన్న సీఎం చంద్రబాబు