స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.ఎన్నికల తేదీని ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆశావాహులు మాత్రం వారి ప్రయత్నాలు ప్రారంభించారు. ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలు మొదలుపెట్టారు. మరో నెల, రెండు నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది.అప్పటి వరకు ఆగడం ఎందుకన్నట్లు ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇప్పటికే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. కొన్ని గ్రామాల్లో అయితే ప్రత్యేక మేనిఫెస్టో(Special Manifesto)లు, సర్పంచ్ పదవుల వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. తాజాగా సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ముహుర్తం ఫిక్స్ చేసింది.

వివరాలు
జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.గ్రామపంచాయతీల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు త్వరగా అమలు కావాలంటే సర్పంచులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో సర్పంచుల పదవి కాలం ముగిసింది. గ్రామాల్లో సర్పంచ్లకు అధికారులు లేకుండా పోయారు. దీంతో పాలన ఎక్కడికక్కడ ఆగిపోయిందని తెలుస్తోంది. అందుకే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా అడుగులు వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.గతంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై స్పందించారు. మొదట జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆ తర్వాత జూలై చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుందని సంబంధిత వర్గాల అధికారులు తెలిపారు.
Read Also: CM Revanth : నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన