ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మాజీ ముఖ్యమంత్రిగా సేవలందించిన ప్రముఖ రాజకీయ నాయకుడు రోశయ్య జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయన క్రమశిక్షణ, నిజాయితీ, వినయం, వివాదాలకు దూరంగా ఉండే రాజకీయ శైలి గురించి సీఎం రేవంత్ ప్రశంసలు కురిపించారు. రోశయ్య రాజకీయ జీవితమంతా దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ముఖ్యంగా యువరాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
బడ్జెట్ మాంత్రికుడిగా రోశయ్య
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా 16 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యదేనని సీఎం రేవంత్ కొనియాడారు. ఇది దేశ రాజ్యాంగ చరిత్రలో అరుదైన ఘనత అని చెప్పారు. ప్రతిసారీ సమతుల్యమైన, సాధారణ ప్రజానికానికి మేలు చేసే విధంగా బడ్జెట్‌లను రూపొందించడం రోశయ్య ప్రత్యేకతగా పేర్కొన్నారు. ప్రజా సమస్యలను బడ్జెట్‌లో ప్రతిబింబించేలా ఆయన పనితీరు ఉండేదని పేర్కొన్నారు.
వివాదరహిత నేతగా జీవితాంతం సేవలు
రోశయ్య తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి గొడవలకు తావివ్వకుండా శాంతంగా, సేవాభావంతో పాలన సాగించిన నాయకుడని సీఎం రేవంత్ అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా, తర్వాత తమిళనాడు గవర్నర్‌గా ఆయన్ను ప్రజలు ఎంతో గౌరవంతో చూడటం అరుదైన విషయం అని అన్నారు. ఆయన స్వచ్ఛత, సామాన్యుడి కోసం చేసే పోరాటం, అహంకారానికి దూరంగా ఉండే ఆచరణా జీవితమే రోశయ్యను గొప్ప నాయకుడిగా నిలబెట్టిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
Read Also : Mallikarjuna Kharge : కాంగ్రెస్ అసంతృప్త నేతలతో ఖర్గే భేటీ