తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సిట్ నోటీసుల నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంధించిన విమర్శలు ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపాయి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న కేటీఆర్, ఇప్పుడు అదే అస్త్రాన్ని ప్రస్తుత ప్రభుత్వంపైకి తిప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్ష నేతలు, చివరికి తన స్వంత మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయడం లేదని అధికారికంగా ప్రకటించగలరా అని ఆయన సవాల్ విసిరారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నదంతా పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై నిఘా ఉంచుతోందని, దమ్ముంటే ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
Davos: సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
ఈ రాజకీయ క్రీడలో అధికారుల పాత్రపై కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు పని చేస్తున్న పోలీసులు, రేపు ప్రభుత్వం మారిన తర్వాత బలి పశువులు అవుతారని ఆయన హెచ్చరించారు. వ్యవస్థను తప్పుదోవ పట్టించి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వల్ల అధికారుల కెరీర్ ప్రమాదంలో పడుతుందని హితవు పలికారు. గతంలో పని చేసిన అధికారులను ఇప్పుడు విచారిస్తున్నట్లే, భవిష్యత్తులో ప్రస్తుత అధికారులకూ అదే పరిస్థితి ఎదురవుతుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఇది అధికారుల్లో ఆందోళన కలిగించేలా ఉంది.

ఇక మాజీ మంత్రి హరీశ్ రావు విచారణపై వస్తున్న వార్తలను కేటీఆర్ ఖండించారు. ఈ కేసులో హరీశ్ రావు ‘విక్టిమ్’ (బాధితుడు) గా విచారణకు హాజరయ్యారనే ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఒక ‘విట్నెస్’ (సాక్షి) గా మాత్రమే ఆయన సిట్ అధికారుల ముందుకు వెళ్లారని వివరించారు. ఈ చిన్న వ్యత్యాసాన్ని కావాలనే ప్రభుత్వం పెద్దది చేసి చూపిస్తోందని, బీఆర్ఎస్ నేతల మధ్య చిచ్చు పెట్టేందుకే ఇలాంటి లీకులు ఇస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మొత్తం మీద, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణల నుండి వ్యవస్థాగత విమర్శల వైపు మళ్లింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com