రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మలుపులు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, జమిలి ఎన్నికల నిర్వహణ వంటి అంశాలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున చర్చనీయాంశాలుగా మారనున్న నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పీసీసీ (PCC) రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొని, సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

పార్టీ బలోపేతానికి వ్యూహాత్మక కార్యాచరణ
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా పార్టీ బలోపేతంపై దృష్టి కేంద్రీకరించారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను ముమ్మరంగా నిర్వహించేందుకు, బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ కమిటీలను పునర్నిర్మించాలన్నదే ఆయన ప్రధాన సూచన.
నామినేటెడ్ పదవుల భర్తీ త్వరలోనే
ప్రస్తుతం ఖాళీగా ఉన్న మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం చేయాలని ఆయన సూచించారు. ఉప ఎన్నికల ఫలితం, రాష్ట్రంలోని ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్నదే సీఎం లక్ష్యం.
పనితీరు ఆధారంగానే పదవులు
పార్టీలో పదవుల కోసం నిరంతరం పనిచేసే కార్యకర్తలకు మాత్రమే అవకాశాలు దక్కుతాయని సీఎం స్పష్టం చేశారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా పనిచేయాలి. ఇందుకోసం బూత్ స్థాయి నుంచి గ్రామ, మండల స్థాయి వరకు పార్టీ కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేయాలి. పార్టీ కమిటీల్లోని నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాల్సిందే. పనితీరు కనబరిస్తేనే పదవులు దక్కుతాయి. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అండగా నిలిచి, కష్టపడి పనిచేసిన వారికి ఇప్పటికే పదవులు ఇచ్చాం, భవిష్యత్తులో కూడా ప్రాధాన్యత ఉంటుంది అని రేవంత్ రెడ్డి అన్నారు.
అవసరమైతే తానే గ్రామాల్లో పర్యటిస్తానని ప్రకటన
పార్టీ నాయకులు నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించిన సీఎం, అవసరమైతే తాను కూడా గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వం మధ్య పూర్తి సమన్వయంతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
Read also: Ponnam Prabhakar: మహంకాళి బోనాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష