బీఆర్ఎస్ కాదు డీఆర్ఎస్.. దెయ్యాల రాష్ట్ర సమితి: సీఎం రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి Revanth Reddy ఆలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన “ప్రజాపాలన – ప్రగతిబాట” బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. “బీఆర్ఎస్ కాదు డీఆర్ఎస్.. అది దెయ్యాల రాష్ట్ర సమితి. పదేళ్లు దోచుకుతిన్న రాబందులు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తారట!” అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని, “ఆ ఇంటి బిడ్డనే చుట్టూ దెయ్యాలున్నాయన్నారు. కానీ ఆ దెయ్యాల నాయకుడు ఇప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఆ కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేరల వరకూ తరిమికొట్టాలి,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే, “ఒక్క నోటీసు ఇచ్చామంటేనే ఆయన ఆగమాగం అయిపోతున్నాడు. జవాబు చెప్పాల్సిన విషయాల్లోనూ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ముందుగా నీ బిడ్డ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు కేసీఆర్ గారు,” అంటూ Revanth Reddy ఘాటుగా స్పందించారు. వాసాలమర్రి ఘటనను గుర్తుచేస్తూ, “ఆ గ్రామంలో ఇండ్లు కూలగొట్టి శ్మశానంగా మార్చారు. ఇప్పుడు మేమే అధికారంలోకి వచ్చి అక్కడ పరిస్థితులను చక్కదిద్దేందుకు కృషి చేస్తున్నాం,” అన్నారు.

యాదగిరిగుట్ట అభివృద్ధికి ప్రత్యేక దృష్టి – మూసీ ప్రక్షాళనపై స్పష్టత
“యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. తిరుమల తరహాలో టెంపుల్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. అలాగే ఆలయం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తాం,” అని సీఎం తెలిపారు. నల్లగొండలో ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ, “మూసీ నది పునరుజ్జీవనానికి నవంబర్ 8న పాదయాత్ర చేసి, ప్రక్షాళన చేస్తానని మాట ఇచ్చాను. మోదీ గంగానదిని శుభ్రం చేయవచ్చు కానీ మేము మూసీ శుభ్రం చేయకూడదా?” అని ప్రశ్నించారు. “ఎవరేమన్నా సరే మూసీ నదిని శుద్ధి చేసి తీరుతాం,” అంటూ స్పష్టత ఇచ్చారు.
సామాజిక సంక్షేమం, అభివృద్ధిపై ఫోకస్
“ప్రజాపాలనలో మహిళలకు ప్రయోజనం కలిగించేలా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. రూ.500కి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు బ్యాంకు లింకేజ్ రుణాలు ఇచ్చాం. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ఆడబిడ్డల విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నాం. కోటి ఆడబిడ్డలను కోటీశ్వరులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి పంట గింజలన్నీ కొంటూ వారి సంక్షేమాన్ని చూస్తున్నాం,” అని వివరించారు. బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతూ, “కుల గణన ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాం. ఇది దేశానికి మార్గదర్శకంగా ఉంటుంది,” అన్నారు.”యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. నీళ్లపై ఎవరు ఏమన్నా, మేమే ఎస్ఆరెస్పీ, మిడ్ మానేరు కట్టాం. నీళ్లెట్లా ఇవ్వాలో మాకు తెలియదా?” అని పునరుద్ఘాటించారు.
తాను చేసిన వాగ్దానాలను నిలబెట్టుకున్నానంటూ స్పష్టం
“ఆనాడు తొడగొట్టి పడగొడతానన్నా.. పడగొట్టి చూపించా. పట్టు పట్టిన.. పడగొట్టిన.. ఇవాళ మీ ముందున్నాను. నాకు ఇక ఏ కోరిక లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం,” అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
Read also: Lady SI: ఖమ్మం కల్లూరులో ఉద్రిక్తత: మహిళా ఎస్‌ఐపై కాంగ్రెస్ నేత దాడి