నటి రేణూ దేశాయ్, యాంకర్ రష్మీ గౌతమ్ సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్ మీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పెను సంచలనంగా మారింది. వీధి కుక్కల దాడిలో చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో, ప్రభుత్వం మరియు మున్సిపల్ అధికారులు కుక్కలను సామూహికంగా చంపడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక కుక్క కరిస్తే వందల కుక్కలను చంపడం అమానవీయమని, ఇది సమస్యకు పరిష్కారం కాదని వారు వాదించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రతిరోజూ ఎంతోమంది చనిపోతున్నారని, అలాంటప్పుడు బైక్ కంపెనీలను మూయించేస్తారా? అని రేణూ ప్రశ్నించారు. మూగజీవాల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించడం మానేసి, వాటి సంతానోత్పత్తి నియంత్రణ (Sterilization) మరియు వ్యాక్సినేషన్ వంటి శాస్త్రీయ పద్ధతులపై దృష్టి పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
Telangana Municipal Elections : ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!
ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధితో రేణూ దేశాయ్‌కు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. “మీరు ఏసీ గదుల్లో కూర్చుని ఇలాంటి మాటలు చెబుతారు” అని సదరు వ్యక్తి విమర్శించడంతో రేణూ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. సామాజిక సేవ గురించి మాట్లాడే హక్కు తనకు ఉందని, చిన్నప్పటి నుండి తాను ఎంతోమంది అనాథలకు, వృద్ధులకు సహాయం చేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. నోరు ఉంది కదా అని అర్థం లేకుండా మాట్లాడొద్దని, మనుషుల ప్రాణాల గురించి అంతగా ఆందోళన ఉన్నవారు సమాజం కోసం ఏంచేశారో చెప్పాలని ఆమె నిలదీశారు. తన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, తాను గాలిలో మాటలు చెప్పడం లేదని ఆమె గట్టిగా సమాధానమిచ్చారు.

అనంతరం ఈ వివాదంపై రేణూ దేశాయ్ ఒక వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు. తాను మీడియా మొత్తమ్మీద కోపగించుకోలేదని, కేవలం తనపై దాడికి ప్రయత్నించిన ఒక వ్యక్తిపై మాత్రమే స్పందించానని తెలిపారు. ఈ గొడవను అడ్డం పెట్టుకుని కొందరు తన రాజకీయ అరంగేట్రం గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. అలాగే, కొందరు నెటిజన్లు తన వ్యక్తిగత జీవితాన్ని, మాజీ భర్త పవన్ కళ్యాణ్‌ను లాగుతూ చేస్తున్న నీచమైన కామెంట్లను చూసి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను డబ్బు కోసమో, పేరు కోసమో కాకుండా సామాజిక బాధ్యతతోనే మాట్లాడుతున్నానని, దయచేసి తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆమె కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com