Rain Alert: బంగాళాఖాతంలో మరోసారి వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాబోయే రెండు రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. ఈ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడుతుందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో అక్టోబర్ 22వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, (Nellore) ప్రకాశం, చిత్తూరు వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ అయ్యాయి. తీరప్రాంతాల్లో గాలివేగం గంటకు 40 కిలోమీటర్ల వరకు నమోదవవచ్చని తెలిపింది. కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేశ్ కుమార్ మత్స్యకారులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. వాతావరణం మార్పు దృష్ట్యా 21వ తేదీ నుండి ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన జాలర్లు వెంటనే తీరానికి తిరిగి రావాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మత్స్యశాఖ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు.
Read also: TG Weather: నైరుతి రుతుపవనాల ప్రభావం.. మూడు రోజులు వర్షాలు

Rain Alert: Heavy rain forecast for Telugu states
ఇక తెలంగాణలోనూ (Telangana) వర్షాలు పడే అవకాశముందని హైదరాబాదు వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా ఉరుములతో కూడిన వానలు పడవచ్చని అంచనా. వాతావరణ నిపుణులు ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ఎప్పుడు అల్పపీడనంగా మారుతుంది?
రాబోయే 48 గంటల్లో, అంటే మంగళవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
ఏపీ, తెలంగాణలో ఎప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంది?
అక్టోబర్ 22 నుండి రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడవచ్చని అంచనా.