బతుకమ్మ, దసరా (Dasara) వంటి ప్రధాన పండుగల సందర్భంగా ప్రజలు తమ స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లే రద్దీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్యాసింజర్లకు శుభవార్త అందించింది. సాధారణంగా పండుగ సీజన్‌లో రైళ్లలో చోటు దొరకడం, చిన్న స్టేషన్ల వద్ద నిలుపుదలలు లేని కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యలను తగ్గించేందుకు ఎస్ఆర్సీ ప్రత్యేక చర్యలు చేపట్టి కొన్ని DEMU రైళ్లకు తాత్కాలికంగా అదనపు స్టాప్‌లను కల్పించింది. ఈ నిర్ణయం వల్ల చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాలకు వెళ్లే ప్రయాణికులకు పెద్ద ఎత్తున సౌలభ్యం కలుగనుంది.
తాత్కాలిక హాల్ట్‌లు – చిన్న స్టేషన్ల ప్రజలకు సౌలభ్యం
ఈ అదనపు హాల్ట్‌లు 2025 సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఈ కాలంలో పండుగ రద్దీని సులభతరం చేసేందుకు ఎస్ఆర్సీ మూడు ముఖ్యమైన హాల్ట్ స్టేషన్లలో నిలుపుదల కల్పించింది. అవి దయనంద్ నగర్, రామకిష్టాపురం గేట్, అల్వాల్ హాల్ట్ స్టేషన్లు. ఈ స్టేషన్ల పరిసర ప్రాంతాల ప్రజలకు ఇది పెద్ద ఊరట కలిగించే నిర్ణయం. సాధారణంగా పండుగల సమయంలో చిన్న హాల్ట్ స్టేషన్ల వద్ద రైళ్లు ఆగకపోవడం వల్ల ప్రయాణికులు దగ్గరలోని పెద్ద స్టేషన్లకు వెళ్లి ఎక్కవలసి వస్తుంది. ఇప్పుడు ఈ తాత్కాలిక నిలుపుదల వల్ల వారు సులభంగా తమ స్టేషన్ నుంచే ఎక్కి ప్రయాణించవచ్చు.

రైళ్ల టైమింగ్స్
ఎస్ఆర్సీ ప్రకటించిన ప్రకారం ఈ నిర్ణయం సికింద్రాబాద్ – సిద్దిపేట (77653), సిద్దిపేట – మల్కాజ్‌గిరి (77654, 77656), మల్కాజ్‌గిరి – సిద్దిపేట (77655), కాచిగూడ – పూర్ణ (77605) వంటి ఐదు ప్రధాన DEMU రైళ్లకు వర్తిస్తుంది. ప్రతి స్టేషన్‌లో అదనంగా ఒక నిమిషం సమయాన్ని కేటాయించారు. ఉదాహరణకు, 77653 రైలు దయనంద్ నగర్‌లో ఉదయం 10.51/10.52 గంటలకు ఆగుతుంది. ఈ విధంగా పండుగ సీజన్‌లో రైళ్లు సులభంగా ఎక్కి దిగేందుకు, రద్దీ తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం చిన్న పట్టణాల ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తం కానుంది.