హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం(PJTSAU) లో మూడవ సంవత్సరం బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సు చదువుతున్న సుమారు 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేసి, వారిని తిరిగి వ్యవసాయ శాఖ కి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య(Professor Aldas Janaiah), ఇతర అధికారుల తో కలసి జగిత్యాల వ్యవసాయ కళాశాలని సందర్శించారు. వివిధ రకాల రికార్డుల పరిశీలన, సీసీ ఫుటేజ్ల ఆధారంగా సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్న పత్రాలు లీకు అవుతున్నట్లు అనుమానించారు. ఈ అంశాన్ని సమగ్రంగా విచారణ చేసేందుకు ముగ్గురు అధికారులతో కమిటీని నియమించారు.
Read also: Hyderabad: గవర్నర్ తో ఒయు విసి ఆచార్య కుమార్ మొలుగరం భేటీ

ఈ కమిటీ అన్ని కోణాల నుంచి విచారణ నిర్వహించింది. వ్యవసాయ శాఖ లో ఏ ఈ ఓ లుగా పని చేస్తూ వ్యవసాయ వర్సిటీ లో ఇన్ సర్వీస్ కోటా లో 3 వ ఏడాది బీ ఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న సుమారు 35 మంది అభ్యర్థులు ఒక పథకం ప్రకారం సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్న పత్రాలను వర్సిటీ సిబ్బంది సహకారంతో లీకు చేసి వాట్సాప్ గ్రూప్ లలో ఇతర వ్యవసాయ కళాశాలల విద్యార్థులకి పంపుతున్నారనీ, ఈ వ్యవహారం లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిందని తేల్చారు. ఒక పథకం ప్రకారం కొన్నేళ్లు గా ఈ వ్యవహారం జరుగుతోందని నిర్ధారించారు. వర్సిటీ ఈ అంశాన్ని చాలా తీవ్రం గా పరిగణిస్తూ ఒక ఉన్నతాధికారి సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అదే విధంగా వ్యవసాయ శాఖ నుంచి ఇన్ సర్వీస్ కోటా(In service quota) లో వచ్చిన సుమారు 35 మంది ని డిస్మిస్ చేస్తూ వారిని వ్యవసాయ శాఖ కి తిరిగి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. 2014 నుంచి 2024 వరకూ పూర్తి స్థాయిలో విశ్వ విద్యాలయం లో ఉన్నత అధికారులు లేకపోవడం తో ఎన్నో అవకతవకలు జరిగాయని, ప్రశ్న పత్రాల లీకేజీ కుంభకోణం అందులో ఒకటనీ ఉప కులపతి అర్దాస్ జానయ్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ప్రక్షాళన మొదలు పెట్టి బాధ్యులైన వారిని సస్పెండ్ చేశామని వివరించారు. అవసరం అయితే సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ చేయాలని కోరతామన్నారు. ఈ అంశానికి సంబంధం ఉన్నవారిని వదిలి పెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్ లో ఇటువంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని ఉప కులపతి అల్దాస్ జానయ్య స్పష్టం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: