హైదరాబాద్ : ‘బీఆర్ఎస్ (BRS) పార్టీలో ఏ బాధ్యత అప్పజెప్పినా చిత్తశుద్ధితో నిర్వర్తించా.. పార్టీలో, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు నన్ను దారుణంగా అవమానించి బయటకుపంపించారు అంటూ. (MLC Kavitha) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలిలో కంటతడి పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ ఉన్న కొంతమంది నాయకులు తనను ఎన్నో సందర్భాలలో అవమానించారని చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇచ్చినా చైర్మన్ ఆమోదం తెలపకపోవడంతో మండలి వేదికగా తన ఆవేదన వెల్లడించేందుకు సభకు వచ్చానని ఆమె పేర్కొన్నారు. సోమవారం శాసనమండలి సమావేశానికి హాజరైన కవిత సభలో భావోద్వేగంతో కన్నీరు పెడుతూనే మాట్లాడుతూ… 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని చెప్పారు. ఆ తర్వాత నుంచి తనపై ఆంక్షలు మొదలయ్యాయని చెప్పారు.
Read also: TG: త్వరలోనే కొత్తగా 2800 ఈవీ బస్సులు: మంత్రి పొన్నం

బీఆర్ఎస్ లో అవినీతి, కక్షలపై కవిత ఆవేదన
బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పార్టీలో అవినీతిని ప్రశ్నిస్తే తనపై కక్షగట్టారని ఆరోపించారు. (MLC Kavitha) ఈడీ, సీబీఐలతో పోరాడేటప్పుడు పార్టీ తనకు అండగా నిలవలేదని, కేసీ ఆర్పై కక్షతో బీజేపీ తనను జైలులో పెట్టించినా పార్టీ ఆదు కోలేదని కవిత విమర్శించారు. అమరువీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు.. అన్నింటా అవినీతి జరిగింది. సిద్దిపేటలో నిర్మించిన కలెక్టరేట్ ఒక్క వర్షానికే కొట్టుకు పోయింది. అమరవీరులకు తగిన గుర్తింపు ఇవ్వాలని, ఉద్యమకారులకు పింఛను ఇవ్వాలని పార్టీ వేదికల్లో డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. కేసీఆర్ను అడిగే ధైర్యం నాకే ఉందని ఎన్నో విషయాలు అడిగాను, బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్నిమార్లు కోరినా ఉపయోగం లేకుండా పోయింది. ఆ పరిశ్రమ తెరిపించలేకపోవడం నాకు అవమానకరం. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పై వచ్చిన ఆరోపణలను బీఆర్ఎస్ లో పెద్ద నాయకులమని చెప్పుకునే వాళ్లు ఎవరూ స్పందించలేదు. లేదు. అందుకే ప్రెస్మీట్ పెట్టి బలంగా మాట్లాడాను. అవినీతిపరుల పేర్లు మీడియాకు వెల్లడించాను అని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై కీలక ప్రకటన చేశారు. తన సంస్థ త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరిస్తుందని, అందరూ తనను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా..
శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతోందని, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని ప్రకటించారు. కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. “వ్యక్తిగా సభ నుంచి వెళుతున్నా.. రాజకీయ శక్తిగా తిరిగి వస్తా” అని కవిత ప్రతిజ్ఞు చేశారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వేదిక రాబోతుందని, విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల కోసం తాను పనిచేస్తానని హామీ ఇచ్చారు. “అవమాన భారంతో పుట్టింటి నుంచి అన్ని బంధనాలు తెంచుకుని మీకోసం వస్తున్నా.. ఆశీర్వదించండి. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుంది” అని ఆమె పేర్కొన్నారు. సభ నుంచి బయటకు వచ్చాక కవిత మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారుల కోసం, వారి ఆశయాల కోసం తెలంగాణ జాగృతి పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానిస్తున్నానని ఆమె అన్నారు. అవినీతి, రైతుల మీద కేసులు, బీఆర్ఎస్ సొంత నాయకులపై కేసులు, బీఆర్ఎస్లో జరిగిన అక్రమాల గురించి తాను అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని అన్నారు.
రాజకీయ వేదికలో అన్ని వర్గాల కోసం పని చేస్తానని హామీ
ఈరోజు కుట్రదారులు, తెలంగాణ ద్రోహులు గెలిచారని మండిపడ్డారు. కానీ బీఆర్ఎస్ కోసం కడుపు కట్టుకుని పని చేసిన ఏ నాయకుడు ఉండలేకపోయారని అన్నారు. తాను ఊరుకునే వ్యక్తిని కాదని, కొట్లాడే ఆడబిడ్డనని అన్నారు. నాడు బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయాన్ని నేడు కాంగ్రెస్ కూడా కొనసాగిస్తోందని ఆరోపించారు. అందుకే తెలంగాణలో ఒక రాజకీయ వేదిక అవసరమని, తెలంగాణ జాగృతి ఆ ఖాళీని పూర్తి చేస్తుందని అన్నారు. ఒక ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్న తనను ఆదరించమని ఆమె కోరారు. ఎప్పుడైనా కొత్త రాజకీయ శక్తి వస్తున్నప్పుడు ఇష్టారీతిన ఆరోపణలు చేయడం సహజమే అన్నారు.
తాను బీఆర్ఎస్ వాటాలు కుదరక బయటకు వచ్చానని కాంగ్రెస్ అంటోందని, తనతో కాంగ్రెస్ మాట్లాడుతోందని బీఆర్ఎస్ చెబుతోందని, కానీ వాదనల్లో వాస్తవం లేదని అన్నారు. తనకు దైవభీతి ఎక్కువ అని, లక్షీ మీద ప్రమాణం చేసి చెబుతున్నానని, తనది ఆస్తుల పంచాయితీ కాదని, రాజకీయ పంచాయితీ అని అన్నారు. తాను బీసీల గురించి, అవినీతి గురించి మాట్లాడానని గుర్తు చేశారు. మండలి చైర్మన్ తన రాజీనామాను ఆమోదిస్తే ప్రజల కోసం పూర్తిగా పోరాడతానని అన్నారు. శాసనమండలిలో తన ప్రసంగం ముగిస్తూ తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన న్ను కోరారు. మండలికి వస్తున్న సందర్భంగా ఆమె తన ఇద్దరు కుమారులను వెంట తీసుకుని వచ్చారు. అక్కడి నుంచి ఆమె అమర వీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: