తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ తన సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న తీవ్ర స్థాయిలో విమర్శలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Mahesh Kumar Goud) గట్టిగా స్పందించారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలకు నచ్చని విధంగా చిత్రీకరించేందుకు బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని మండిపడ్డారు.

సామాజిక న్యాయ పరిరక్షణలో కాంగ్రెస్ ముందుకు
“కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని అమలుచేయడంలో దాదాపు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పథకాలను ప్రవేశపెట్టింది. దీనికి నిదర్శనమే హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో హడావుడిగా దళితబంధు పథకాన్ని తీసుకురావడం” అని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన అందిస్తోందని, దీనిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకులు సామాజిక మాధ్యమాల్లో కట్టుకథలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి కంటే, కేవలం 18 నెలల తమ కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. “పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటో, వారి పాలనలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలందరికీ బాగా తెలుసు. రాష్ట్ర ప్రజల అవసరాలను, రాష్ట్ర హక్కులను గత ప్రభుత్వం పూర్తిగా తాకట్టుపెట్టింది” అని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై స్పష్టత
గోదావరి-బనకచర్ల నీటి ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై తమ ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోందని, అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజలకు వాస్తవాలు వివరించి, భారాస చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Read also: Local body elections: సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హై కోర్టు తీర్పు