ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ ఎదుర్కొన్న అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ విచారణ ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేటీఆర్, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన విచారణ తీరును బట్టి చూస్తుంటే, ఇప్పుడున్న ప్రభుత్వంలోనే మంత్రులు మరియు కీలక రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అర్థమవుతోందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. విచారణలో సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలనే పదేపదే అడుగుతూ కాలయాపన చేశారని, ఇందులో కొత్తదనం ఏమీ లేదని ఆయన కొట్టిపారేశారు. ఈ విచారణ అంతా ఒక ప్రహసనంలా సాగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ అక్రమ కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారులు అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని అన్నారని, దానికి తాను సానుకూలంగా స్పందిస్తూ ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు వెల్లడించారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని, నిజానిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే, విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే ఇది కేవలం తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నంలా కనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Bhatti Vikramarka: తెలంగాణలో రేపటి నుంచి సన్నాహక సమావేశాలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని “లీకువీరుల ప్రభుత్వం” అని కేటీఆర్ తీవ్రంగా ఎద్దేవా చేశారు. విచారణ లోపల ఏం జరుగుతుందో తెలియదు కానీ, బయటకు మాత్రం రకరకాల లీకులు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ డ్రామాను నడిపిస్తున్నారని, అసలైన ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ ప్రభుత్వం ఇటువంటి కుట్రలకు తెరలేపిందని ధ్వజమెత్తారు. ఈ పోరాటాన్ని న్యాయపరంగా మరియు రాజకీయంగా ఎదుర్కొంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com