బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) తనపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై తీవ్రంగా స్పందించారు. శాసన మండలిలో సభ్యుడిగా ఉన్న మల్లన్న చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ, ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఛైర్మన్ నివాసానికి వెళ్లి ఫిర్యాదు లేఖతో పాటు, మల్లన్న వ్యాఖ్యల ట్రాన్స్‌క్రిప్ట్ మరియు పెన్ డ్రైవ్‌ను కూడా సమర్పించారు. ఈ విషయాన్ని “ఎథిక్స్ కమిటీకి” రిఫర్ చేయాలని ఆమె కోరారు.
బీసీ రిజర్వేషన్ల ఉద్యమంపై దుష్ప్రచారం
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో, సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో నిర్వహించిన బీసీ విజయోత్సవ సభపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని కవిత పేర్కొన్నారు. చట్టసభ సభ్యురాలిపై ఇలాంటి మాటలు చెప్పిన తీన్మార్ గారి మనస్తత్వం ద్వారా, సామాన్య మహిళల పట్ల ఆయనకు గౌరవం లేదని నిర్ధారించవచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో మహిళల ప్రవేశాన్ని తగ్గించేలా ఉన్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ డిమాండ్
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కవిత, తమ పార్టీ కార్యకర్తల నిరసనను సమర్థించగా, ఆ తర్వాత జరిగిన గన్‌ఫైర్ ఘటనపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “మాటలకే గన్ ఫైర్ చేస్తారా? నేను మౌనంగా ఉండను. సీఎం వెంటనే స్పందించాలి, లేకపోతే వెనుక మీరు ఉన్నట్లు భావించాల్సి వస్తుంది” అని హెచ్చరించారు. ఫైరింగ్ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని, తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుండి వెంటనే సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇది సాధారణ మహిళల హక్కులను పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన నిర్ణయమని కవిత స్పష్టం చేశారు.
Read Also : Secunderabad Bonalu: సికింద్రాబాద్ బోనాల జాతరలో పాల్గొన్న ప్రముఖులు..