స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah
) పాదయాత్ర కొనసాగుతుండగా, ఆయనను హౌస్ అరెస్ట్ చేసిన ఘటనపై బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజయ్యను ఇంటి వద్ద కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ, కారు గుర్తుపై గెలిచిన కడియం శ్రీహరి పార్టీ మారడం నైతిక విలువలకు విరుద్ధమని విమర్శించారు.
రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని డిమాండ్
కడియం శ్రీహరి(kadiyam Srihari)కి నిజంగా సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ లాభం కోసం పార్టీ మార్చారని, నీతి వాక్యాలు వల్లించే ఆయన అసలు అవినీతి చక్రవర్తి అని ఎద్దేవా చేశారు. బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేసి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.

కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వ్యాఖ్య
కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నా ఆయన ప్రవర్తన ఊసరవెల్లిని మించుతోందని వినయ్ భాస్కర్ తీవ్రంగా విమర్శించారు. రాజన్న పాదయాత్రకు వస్తున్న ఆదరణను తట్టుకోలేకనే ఆయనను హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఉపఎన్నికలు జరిగితే స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, తిరిగి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలనకే ప్రజలు ఆశ చూపుతున్నారని అన్నారు.