తెలంగాణ బీసీ రిజర్వేషన్ల అంశం మరియు సోనియా గాంధీ లేఖ నేపథ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth) స్పందనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన కేటీఆర్, సోనియా గాంధీ రాసిన లేఖలో ఏముందో కూడా సీఎం రేవంత్‌కు తెలియదని వ్యాఖ్యానించారు. “లేఖ చదివే అర్హత కూడా లేకుండా ఆనందపడుతున్నాడు” అంటూ రేవంత్‌పై కేటీఆర్ వ్యంగ్యంగా చురకలంటించారు.
డిగ్రీ సర్టిఫికేట్ ఫేక్
సీఎం రేవంత్ రెడ్డి తనకు ఉన్న డిగ్రీ సర్టిఫికేట్ గురించి చెప్పుకుంటున్నప్పుడు అది నిజమైనదేనా అనే అనుమానం వ్యక్తం చేశారు కేటీఆర్. సోనియా గాంధీ తనను మెచ్చుకుంటూ లేఖ రాశారని రేవంత్ చెబుతున్నప్పటికీ, ఆ లేఖలో అలాంటి ఒక్క మాట కూడా లేదని స్పష్టం చేశారు. కేవలం “కార్యక్రమానికి రావడం సాధ్యం కాదు” అనే విషయమే ఉందని వివరించారు. అయితే రేవంత్ మాత్రం ఆ లేఖను ఆస్కార్ అవార్డు, నోబెల్ బహుమతిగా భావిస్తూ హంగామా చేస్తున్నారని విమర్శించారు. ఇది చూస్తే జాలేస్తోందని వ్యాఖ్యానించారు.
బీసీ గణనపై ఢిల్లీలో ప్రెజెంటేషన్
జులై 24న ఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరా భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి బీసీ గణన అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు, అగ్రనేతలు హాజరైనప్పటికీ సోనియా గాంధీ మాత్రం రావలేదు. ఆమె అందించిన లేఖను రేవంత్ ఎంతో గర్వంగా తీసుకున్నా, కేటీఆర్ మాత్రం దానిని రాజకీయ అతి ఉత్సాహంగా అభివర్ణిస్తూ ఎద్దేవా చేశారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ నాయకత్వం, రేవంత్ నాయకత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి కొనసాగిస్తోందని స్పష్టమవుతోంది.
Read Also : OBC : ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ OBCలకు రిజర్వేషన్లు ఇవ్వాలి – రాహుల్