దేశమంతా హోలీ సంబురాలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రంగుల పండుగను ఎంజాయ్ చేశారు. ముఖ్యంగాహైదరాబాద్ నగరంలో హోలీ వేడుకలు వైభవంగా సాగాయి. గల్లీ గల్లీల్లో రంగులు నిండాయి. అయితేహోలీ సందర్భంగా నగరంలో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వేడుకలు కూడా నిర్వహించారు. రెయినీ డ్యాన్సులు,డీజే పాటతో యువత తమ స్నేహితులతో సంబురాల్లో మునిగి తేలారు. అయితేఈ హోలీ సంబురాల ముసుగులో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హోలీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గంజాయి వినియోగం తీవ్ర కలకలం సృష్టించింది. ఎస్‌టీఎఫ్ దాడులతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ గంజాయిని రెగ్యూలర్‌గా కాకుండా ఐస్ క్రీమ్‌లు, చాక్లెట్లు, స్వీట్ల రూపంలో యువతకు సరఫరా చేయటం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
గంజాయి విక్రయం
హైదరాబాద్ నగరంలోని లోయర్ ధూల్‌పేట ప్రాంతంలోని మల్చిపురాలో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొనే యువత కోసం కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, బర్ఫీ స్వీట్లతో పాటు మరికొన్ని స్వీట్స్ ఏర్పాటు చేశారు. అయితే అవి కేవలం ఆ స్వీట్లు కేవలం చక్కెరతో చేశారనుకుంటే పొరపాటే. పంచదారతో పాటు కాస్త గంజాయిని కూడా కలిపి ప్రత్యేకంగా చేపించారు. ఈ గంజాయి స్వీట్ల గురించిన విశ్వసనీయం సమాచారం.పోలీసులకు చేరటంతో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్టీఎఫ్ అధికారులు ఆ వేడుకలపై దాడులు చేశారు.
పోలీసుల దర్యాప్తు
విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు దాడి చేసి 100 కుల్ఫీ ఐస్ క్రీమ్‌లు, 72 బర్ఫీ స్వీట్లు, సిల్వర్ కోటెడ్ బాల్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యం కుల్ఫీ ఐస్‌క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి వాటిలో ఈసారి గంజాయిని మిక్స్ చేసి హోలీ స్పెషల్‌గా అమ్మేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీంలు, స్వీట్లు అన్నీ స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హోలీ సందర్భంగా పోలీసులు కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రంజాన్ మాసంలో శుక్రవారం రోజే హోలీ వచ్చిన నేపథ్యంలోపోలీసులు ముందు నుంచే అప్రమత్తంగా వ్యవహరించారు. హోలీ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగొద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో నగరంలో వైన్ షాపులు కూడా బంద్ చేశారు. అయితే పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ఎన్ని వార్నింగులు ఇచ్చినా కొన్ని చోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా ఇలాంటి కొన్ని వేడుకల్లో గుట్టుగా గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల వినియోగం జరిగినట్టు సమాచారం.