సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండల గ్రామాల రైతులు ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు కోల్పోకుండా పాత అలైన్‌మెంట్‌ను కొనసాగించాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harishrao)ను కలిసి కోరారు. దీనిపై స్పందించిన హరీశ్‌రావు, రైతుల పక్షాన తాను బలంగా నిలుస్తానని, భూములు కోల్పోకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
ట్రిపుల్ ఆర్ (RRR) పేరిట ఇష్టారీతిగా అలైన్‌మెంట్ మార్చి పేద రైతుల పొలాలను బలి చేస్తున్నారని హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాంగ్రెస్ నాయకుల భూములకు ఏమాత్రం నష్టం జరగకుండా, రైతుల పచ్చని పొలాలు మాత్రమే కోల్పోవడం సిగ్గుచేటు అన్నారు. యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్ సహా పలు జిల్లాల్లో వేలాది ఎకరాలు కోల్పోతున్న రైతులు నిరసనలతో రోడ్లపైకి రావడం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూపిస్తోందని ఆయన తెలిపారు.

హామీలు నిలబెట్టకపోతే తీవ్ర పోరాటం
ఎన్నికల ముందు రైతులకు అండగా ఉంటామని కాంగ్రెస్ నేతలు, జాతీయ నాయకులు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక నిర్బంధాల మధ్య భూసేకరణ చేస్తుండడం కర్కశమని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే అలైన్‌మెంట్ మార్పులు జరగడం వల్ల కేంద్రం ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును తిరస్కరించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టే చర్యలు కొనసాగితే బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని, సమగ్ర విచారణ తప్పనిసరిగా జరగాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.