సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు హఠాత్తుగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు.ఈ మార్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ నేతలు మాజీ మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.పార్టీలోకి చేరిన వారిలో సీడీసీ మాజీ చైర్మన్ ఉమాకాంత్ పటేల్, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు బస్వరాజు, మాజీ ఎంపీటీసీలు విజయేందర్ రెడ్డి, సంతోష్ పాటిల్, సీనియర్ నాయకులు సుభాష్ రావు, భూమయ్య, లక్ష్మయ్యలతో పాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, తెలంగాణకు బీజేపీ పార్టీ పూర్తిగా న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రంలో ఎనిమిది మంది ఎంపీలు గెలిచినా, రాష్ట్రానికి బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత దక్కలేదన్నారు.

కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణను విస్మరించిందని ఆయన తీవ్రంగా విమర్శించారు.అంతేకాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు ధ్వజమెత్తారు.సంగారెడ్డిలో అభివృద్ధి పనులకు అడ్డు అవుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో మొదలైన బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనపెట్టిందని ఆరోపించారు.ఇప్పటి వరకు విడుదల చేయాల్సిన ఎస్డీఎఫ్ నిధులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆపేస్తోందని, దీని వల్ల జిల్లాలో అభివృద్ధి నీలినీడలా నిలిచిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమై ఉందని, ప్రజల భవిష్యత్‌ను తాకట్టు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన నేతలు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నిజంగా పరిష్కరించే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనని పేర్కొన్నారు. తమ ప్రయోజనాలకు కాదు, ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్‌ను ఎంచుకున్నామని తెలిపారు.