हिन्दी | Epaper

Fertilizer App: యూరియా యాప్ తో యాతన

Saritha
Fertilizer App: యూరియా యాప్ తో యాతన

హైదరాబాద్ : రైతులు (Farmers) యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేకంగా యాప్ ను తీసుకువచ్చినా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. యూరియా యాప్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. యూరియాకోసం అన్నదాతలు నిద్రాహారాలు మాని రాత్రిం బవళ్లు చాంతాడంతా క్యూలలో పడిగాపులుకాయొద్దన్న లక్ష్యంతో తీసుకువచ్చిన (Fertilizer App) ఫర్టిలైజర్ బుకింగ్/యూరియా యాప్తోనూ అన్నదాతలకు ఇబ్బం దులు తప్పడం లేదు. యూరియా కావాలనుకునే రైతులు ఎరువుల డీలర్ల వద్దకు, ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్తున్నా యాప్ వినియోగం అర్ధం కాక రైతులు గందరగోళానికి గురవుతున్నారు.

Central Minister: ప్రజల మద్దతు బీజేపీకె కిషన్ రెడ్డి

Fertilizer App: యూరియా యాప్ తో యాతన
The struggle with the urea app

పలుచోట్ల రైతన్నల ఆందోళనలు

ముఖ్యంగా అంతంత మాత్రం చదువులతో సేద్యం చేసుకుంటున్న రైతన్నకు మొబైల్ యాప్ ద్వారా ఎరువులను బుక్ చేసుకోవాలంటే కత్తి మీద సాములాగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నప్పటికీ చాలా మంది రైతులవద్ద ఇప్పటికీ ఆండ్రాయిడ్ ఫోన్లు లేకపోవడంతో యూరియా యాప్తో రైతన్నల కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఇప్పటికీ కీ ప్యాడ్ ఫోన్లనే చాలా మంది రైతులు ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా యాప్లో ఎరువులు బుక్ చేయడం, ఓటీపీలు చెప్పడంపై ఏ మాత్రం అవగాహన అన్నదాతలకు లేదు. అదే సమయంలో బుక్ చేసుకున్న చాలా సమయం తర్వాత ఓటీపీ వస్తుండడంతో అప్పటి వరకు అన్నదాతలు (Fertilizer App) ఫర్టిలైజర్ షాపుల వద్దనే పడిగాపులుగాయాల్సి వస్తోంది. అదే సమయంలో చాలా మంది రైతులకు ఎరువుల షాపుల పేర్లు కూడా తెలియకపోవడంతో యాప్లో ఎరువులను బుక్ చేసుకుంటే ఊరు, దుకాణం పేరు తదితర వివరాల నమోదు రైతులను తికమకపెట్టేస్తోంది.

మా వద్ద ఉన్నవి చిన్న ఫోన్లే.. ఎలా బుక్ చేయాలి..?

ఏ షాపు పేరు బుక్ చేస్తే అదే దుకాణానికి వెళ్లి ఓటీపీ నంబర్ చెబితేనే ఎరువులు ఇస్తుండడం అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులకూ యూరియా యాప్ ఇబ్బందులను సృష్టిస్తోంది. పేరు నమోదు చేసిన షాపులో స్టాక్ లేదని చెబుతుండడంతో సుదూరంగా ఉన్న ఫర్టిలైజర్ షాపు పేరుతో అనివార్యంగా అన్నదాతలు యూరియాను బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బుక్ చేశాక నిర్దేశిత గడువులోగా షాప్కు వెళ్లి తీసుకోకపోతే బుకింగ్ క్యాన్సల్ అవుతోంది. ఇక బుకింగ్ సమయంలో రైతులు సీజన్, పాస్ బుక్ వివరాలు, పంట రకాలు, సాగు విస్తీర్ణం ఎంత ఉంది అనే వివరాలను యాప్ లో నమోదు చేయాలి. ఈ సమాచారం ఆధారంగా రైతుకు అవసరమైన యూరియా పరిమాణాన్ని తెలియజేస్తూ దానిని ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు అనేది యాప్ స్వయంగా లెక్కించి చెబుతుండడంతో అవసరం మేర యూరియా కొనుగోలు చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో గతంలో ఇచ్చినట్లే యూరియాను పాత పద్ధతిలోనే ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. వానకాలంలో యూరియా ఇచ్చినట్లు గోదాంలో పైసలు కట్టి తీసుకపోయినట్లు ఇస్తే బాగుంటదని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలు గ్రామాల రైతులు యూరియా కోసం బుకింగ్కు ప్రయత్నించగా నిల్వల వివరాలు యాప్లో కనిపించకపోవడంతో మంగళవారం ధర్నాకు దిగారు. యూరియా యాప్తో కష్టాలు తప్పడం లేదంటూ ఆందోళన నిర్వహించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870