వికారాబాద్ జిల్లాలోని పరిగి (మ) మండలంలోని రంగాపూర్ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) జరిగింది. బీజాపూర్-హైదరాబాద్ హైవేపై నిలిచివున్న లారీని వేగంగా వస్తున్న పెళ్లి బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ఘటనాస్థలంలోనే మృతి (4 Dies) చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఘటనాస్థలాన్ని చూసిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్
గాయపడినవారిని పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పారిపోయినట్లు తెలుస్తోంది. వాహనాన్ని స్వాధీనం చేసుకొని అతని కోసం గాలింపు చేపట్టారు.
వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం
ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారు పరిగి మండలంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారని సమాచారం. ఈ దుర్ఘటనతో వారి గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ప్రమాదంపై స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి సహాయమందించాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also : Golden Temple : గోల్డెన్ టెంపుల్ లక్ష్యంగా పాక్ దాడులు – ఆర్మీ అధికారి