తెలంగాణలో రిజర్వేషన్ల (BC Reservation) పెంపు విషయంపై MLC కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఆమె ఈ ప్రక్రియను తాను సాధించిన విజయంగా ప్రకటించడాన్ని, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాస్యాస్పదంగా అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ఈ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ ప్రారంభమైందని, బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు రాజకీయ లబ్దికోసం క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
“జైల్లో ఉండి విజయాలు ఎలా సాధించారు?” – మహేశ్ సెటైర్లు
MLC కవిత తిహార్ జైల్లో ఉన్న సమయంలోనే రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ ముందుకు సాగిందని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. “ఆమె అప్పట్లో జైల్లో ఉండగానే ఈ నిర్ణయాలు తీసుకురాబడ్డాయి. ఎప్పుడు, ఎలా పోరాటం చేసింది కవిత?” అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయకుండా, రాజకీయంగా బలహీనమైన సమయంలో తమకున్న విజయాలుగా ముద్ర వేసుకోవడం అనుచితమని వ్యాఖ్యానించారు.
“కవిత ఏ పార్టీలో ఉన్నారో కూడా ఆమెకే తెలియదా?”
అంతేకాకుండా, మహేశ్ గౌడ్ తీవ్ర విమర్శలు చేస్తూ, “కవిత ఇప్పుడెక్కడున్నారు? ఆమె ఏ పార్టీలో ఉన్నారు? బీఆర్‌ఎస్‌లోనా? లేక ఇంకెక్కడైనా?” అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రజలు కవిత మాటలు నమ్మే స్థితిలో లేరని, ఆమె వ్యాఖ్యలు ప్రజలను నవ్విస్తున్నాయన్నారు. రాజకీయ స్పష్టత లేని నాయకత్వంతో ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిన వారు ఇప్పుడు ఎటు పోతున్నారో తెలియని స్థితిలో ఉన్నారని మహేశ్ గౌడ్ ఎద్దేవా చేశారు.
Read Also : Donald Trump : EU, మెక్సికోపై 30% టారిఫ్స్ – ట్రంప్