హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ… రాజకీయాల్లో ఫైట్ చేస్తానని.. తాను సింపతీ మీద రాజకీయాల్లోకి రాలేదని చెప్పుకొచ్చారు. త్వరలో సినిమాల్లోకి రానున్నట్లు ప్రకటించారు. అతి త్వరలో ఒక ప్రేమ కథ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు ఆఫ్ ది రికార్డ్‌లో ఆయన వెల్లడించారు. సినిమాలో మాఫియాను ఎదురించి ఆడపిల్ల పెళ్ళి చేసే వ్యక్తి అతనే జగ్గారెడ్డి అని అన్నారు. ఈ మధ్య కాలంలో ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఒక కథ ఉంది అని చెప్పారన్నారు.

జగ్గారెడ్డి…వార్ ఆఫ్ లవ్
ఆ కథలో మీ పాత్ర ఉందని అన్నారు. ఆ సినిమాలో నటిస్తా అని చెప్పాను. ఈ కథలో నా ఒరిజినల్ క్యారక్టర్ కూడా ఉండబోతుంది. ఈ ఉగాదికి సినిమా కథ విని.. వచ్చే ఉగాదికి సినిమా పూర్తి చేస్తాం. పీసీసీ, సీఎం అనుమతి తీసుకొని నటిస్తాను అని వెల్లడించారు. ఇక సినిమా పేరును కూడా ప్రకటించేశారు జగ్గారెడ్డి. అదే ‘జగ్గారెడ్డి…వార్ ఆఫ్ లవ్’ అనే టైటిల్‌ను ఖారారు చేసినట్లు తెలిపారు. కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చూసి మైండ్ బ్లాక్ అయిందన్నారు. తాను రాజకీయంగా షాక్‌లో ఉన్నట్లు తెలిపారు.
నాటి కష్టాలు పరిణామాలు చెప్పాలని
తన షాక్‌కు కాలం సమాధానం చెబుతుందన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జట్టి కుసుము అని తెలిపారు. అనుకోకుండా ఢిల్లీకి తెలంగాణ నుంచి నేతలు రాలేదన్నారు. 2017లో రాహుల్ గాంధీ సంగారెడ్డి సభను తానే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాటి కష్టాలు పరిణామాలు చెప్పాలని అనుకున్నానని.. దానిపై రాహుల్ గాంధీని కలిసేందుకు ఢిల్లీకి వచ్చినట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీని సమయం అడిగానని అన్నారు. కుసుమకు ఎమ్మెల్సీ ఇవ్వాలని పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీసీఎ భట్టి విక్రమార్కకు చెప్పానన్నారు.