మొంథా తుపాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తీవ్ర నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. తుపానుతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇళ్లు పూర్తిగా మునిగిపోయిన కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయంగా రూ.15 వేలు, గుడిసెలు ధ్వంసమైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద కొత్త ఇళ్లు కట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పంటలు, ఇళ్లు, రహదారులు, పశువులు వంటి విభాగాల్లో జరిగిన నష్టానికి సమగ్ర నివేదికలను సిద్ధం చేసి తక్షణమే కేంద్రానికి సమర్పించాలన్నారు. కేంద్ర నిధులు రాబట్టడంలో ఎటువంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని అధికారులను హెచ్చరించారు.
Latest News: Bangladesh: ప్రాణ భయంతో దేశం విడిచానని మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడి!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంట నష్టాల విషయంలో రైతులకు పెద్ద ఊరట ఇచ్చారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. తుపానుతో గేదెలు, ఆవులు మరణించిన రైతులకు రూ.50 వేలు, మేకలు, గొర్రెలు నష్టపోయిన వారికి రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ పరిహార చర్యలు రైతులకు, పశుపాలకులకు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.48 లక్షల ఎకరాల పంటలు నీట మునిగాయని, వరంగల్ మరియు హనుమకొండ జిల్లాల్లో తుపాను తీవ్రంగా ప్రభావం చూపిందని అధికారులు సమీక్షలో వెల్లడించారు. ఇప్పటికే ముంపు ప్రాంతాల నుంచి 2 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారని సీఎం తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హుస్నాబాద్, సమ్మయ్యనగర్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి నష్టం తీవ్రతను స్వయంగా అంచనా వేశారు. ప్రతి జిల్లాలో సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహార పదార్థాలు, తాగునీరు, వైద్య సేవలు, అవసరమైన మందులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కలిసి బాధితుల వద్దకు చేరుకోవాలని సూచించారు. రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ, కేంద్రం నుంచి రావాల్సిన విపత్తు నిధులను వదులుకోవద్దని ముఖ్యమంత్రి అన్నారు. ప్రకృతి విపత్తు సమయంలో ప్రజల పక్కన నిలబడి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టడంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, రేవంత్ సర్కార్ తుపాను బాధితుల పునరావాసానికి అంకితభావంతో పనిచేస్తుందని ప్రజలు అభినందిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/