Bomb Threat : హన్మకొండ సుబేదారి లోని జిల్లా కోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడు జిల్లా జడ్జికి ఈమెయిల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కోర్టుకు చేరుకున్నారు. కోర్టు పరిధిలో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం సైతం పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టులో బాంబు పెట్టామంటూ వస్తున్న ప్రచారానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం
ఇకపోతే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. బాంబు పెట్టి కలెక్టర్ కార్యాలయాన్ని పేల్చివేస్తామని, ఓ ఆగంతకుడు కలెక్టరేట్ కు మెయిల్ పెట్టాడు. దాంతో ఈ విషయంపై విచారణ చేయాలని కలెక్టర్ గౌతం డీసీపీ కోటిరెడ్డికి ఆదేశాలు ఇవ్వడంతో ఆయన మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే అంశంపై విచారణ చేస్తున్నారు. కాగా, కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు నేపథ్యంలో ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం అయ్యారు. కరీంనగర్ కు చెందిన మావోయిస్టు లక్ష్మణరావు పేరిట మెయిల్ వచ్చింది. అందులో ఆఖరిగా అల్లాహు అక్బర్ అనే నినాదం ఉండటం గమనార్హం.కలెక్టరేట్ లోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులను బయటకు పంపించిన పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనీఖీలు చేపట్టారు.