తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త భూ పాలనా విధానం ‘భూభారతి’ చట్టం నేటి (ఏప్రిల్ 14) నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అధికారికంగా భూభారతి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు వ్యవసాయ భూముల కొనుగోలు, అమ్మకాలు ధరణి పోర్టల్ ద్వారా జరగగా, ఇకపై అదే విధానాన్ని భూభారతి ద్వారా నిర్వహించనున్నారు. ఇది భూ వ్యవహారాల్లో పారదర్శకతను తీసుకురావడమే కాక, ప్రజలకు సులభతరంగా సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది.
ప్రస్తుతం మూడు చోట్ల భూభారతి చట్టం అమలు
తదుపరి ప్రక్రియలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అమలు చేస్తే ప్రజలకు, అధికారులు సంభవించే అవరోధాలను దృష్టిలో ఉంచుకొని, భూభారతి చట్టాన్ని ప్రారంభంలో ప్రాయోగికంగా మూడుచోట్ల అమలు చేయనున్నారు. మొదటిగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి సాగర్, మేడ్చల్ జిల్లాలో కీసర, సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట మండలాల్లో ఈ చట్టాన్ని అమలు చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి, వచ్చిన ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.

భూభారతి చట్టం లక్ష్యం
ఈ భూభారతి చట్టం ద్వారా ప్రజల భూ హక్కులను రక్షించడం, అన్యాయ రిజిస్ట్రేషన్లను నిరోధించడం, ప్రభుత్వ భూములను కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ధరణిలో గతంలో చోటు చేసుకున్న లోపాలను సరిదిద్దుతూ, భూ వ్యవహారాల్లో పూర్తిస్థాయి భద్రత, న్యాయాన్ని అందించడమే ప్రభుత్వం సంకల్పంగా తీసుకుంది. భూభారతి చట్టంతో భూసంబంధిత సేవలు మరింత సునిశితంగా సాగనున్నాయి.