Narayana Reddy : భూభారతి చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలి
సరూర్‌నగర్: భూసమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంపై ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి పేర్కొన్నారు. భూమి హక్కుల చట్టం-2025కు అనుసంధానంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా, రంగారెడ్డి జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని బాలాపూర్ మండల కేంద్రంలో బుధవారం ఒక అవగాహన సదస్సు నిర్వహించారు.బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ సదస్సుకు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి అధ్యక్షత వహించగా, బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి సమన్వయంలో సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని భూవివాదాలులేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించామని వెల్లడించారు. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి ఇది కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

భూమి హక్కుల పరిరక్షణకు భూభారతి చట్టం కీలకం
ధరణి పోర్టల్‌లో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, సమాచారం లోపాలు, పాత భూ పట్టాలు, రిజిస్ట్రేషన్ సమస్యలు తదితరాల కారణంగా ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని కలెక్టర్ తెలిపారు. అయితే, భూభారతి చట్టం అమలులోకి రాగానే ఈ సమస్యలకు సమాధానాలు లభిస్తాయని చెప్పారు. ఈ చట్టం ద్వారా భూముల నమోదు, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీయుఎఫ్‌ఐడిసిఇ ఛైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి, బడంగ్‌పేట్ మున్సిపల్ కమీషనర్ సరస్వతి, మీర్పేట్ కమీషనర్ జ్ఞానేశ్వర్, జల్పల్లి కమీషనర్ వెంకట్రామ్ తదితర అధికారులు పాల్గొన్నారు. రైతు సంఘాల నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతు సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో భూభారతి చట్టాన్ని ప్రజలకు వివరించడంతోపాటు భూసమస్యలపై వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.ఈ చట్టంపై ప్రజలందరూ అవగాహన పెంచుకుని, తమ భూముల హక్కులను పరిరక్షించుకోవాలని కలెక్టర్ సూచించారు.
Read More : California Sales Tax : కాలిఫోర్నియాలో పెరిగిన సేల్స్ ట్యాక్స్ భారం