టీజీ ఎస్‌పీడీసిఎల్ లో బతుకమ్మ (Bathukamma) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ మింట్ కంపౌండ్ లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకలకు పర్యావరణం, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగాను, సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ , ఐఏఎస్ గౌరవ అతిధులుగాను పాల్గొని బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించామని ఎలక్ట్రిసిటీ ఉమెన్స్ వెల్పేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, జనరల్ మేనేజర్ డాక్టర్ ఎం. తులసి నాగరాణి ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మహిళా సోదరీమణులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళలు అభివృద్ధి పథంలో నడుస్తున్నారని అన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి పొన్నం సారధ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన విషయాన్ని మరువరాదన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన నేపథ్యంలో మహిళలు ప్రయాణాలు సాఫిగా సాగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లోనూ మహిళలకు పెద్ద పీట వేస్తామని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు.
కాగా ఈ కార్యక్రమంలో పలువురు మహిళా ఉద్యోగినులు పాల్గొని భక్తి శ్రద్ధలతో బతుకమ్మకు పూజలు చేసి సంతోషంగా ఆడి పాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం. తులసి నాగరాణి తో పాటు సంస్థ డైరెక్టర్లు శివాజీ, డా. నరసింహులు, చక్రపాణి, కృష్ణా రెడ్డి, సీజీఎంలు సుధా మాధురి, శోభారాణి, మహిళా సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ టీ. కవిత, ఫైనాన్స్ సెక్రటరీ కె.లత, ఉపాధ్యక్షురాలు మంగమ్మ , సత్యమ్మ , ఇతర ఉద్యోగినులు పాల్గొన్నారు.