భక్తులకు విశేష అవకాశం కల్పించింది దక్షిణ మధ్య రైల్వే. దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు భక్తులకు ఒక ప్రత్యేక యాత్రను ప్రకటించింది. భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు పేరుతో ఈ ప్రయాణాన్ని మార్చి 21న ప్రారంభించనున్నారు. ఈ యాత్ర ప్రత్యేకంగా సప్త జ్యోతిర్లింగ దర్శనం చేయాలనుకునే భక్తుల కోసం రూపొందించబడింది.

ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మార్చి 21 మధ్యాహ్నం 12:00 గంటలకు బయలుదేరుతుంది. యాత్ర మొత్తం 9 రోజులు, 8 రాత్రులు కొనసాగుతుంది. ఇందులో భక్తులు అరుణాచలం, రామేశ్వరం, మధురై, శ్రీరంగం, కన్యాకుమారి, తిరుచ్చి, తిరువనంతపురం, అనంత పద్మనాభస్వామి ఆలయం, తంజావూరు వంటి ప్రముఖ క్షేత్రాలను సందర్శించనున్నారు. ఈ రైలు భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట వంటి ప్రధాన స్టేషన్లలో హాల్ట్ కల్పిస్తుంది. తద్వారా భక్తులు ఎక్కడి నుంచి అయినా ఈ యాత్రలో చేరేందుకు వీలుంటుంది.
ప్రయాణ వివరాలు
మొదటి రోజు – సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, రాత్రి ప్రయాణం. రెండో రోజు – ఉదయం 7:30 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటారు. మూడో రోజు – ఉదయం 6:30 గంటలకు కుదల్‌నగర్ చేరుకుని అక్కడ పూజలు, దర్శనం చేస్తారు. నాలుగో రోజు – రామేశ్వరం చేరుకుని మధ్యాహ్న భోజనం అనంతరం మధురై చేరుకుంటారు. ఐదో రోజు – కన్యాకుమారి చేరుకుని సూర్యోదయాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. ఆరో రోజు – తిరువనంతపురం చేరుకుని అనంత పద్మనాభస్వామి ఆలయం దర్శించుకుంటారు. ఏడో రోజు – తిరుచిరాపల్లి, శ్రీరంగం చేరుకుని భక్తులు పూజలు నిర్వహించనున్నారు. ఎనిమిదో రోజు – రాత్రంతా ప్రయాణం. తొమ్మిదో రోజు – ఉదయం 2:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుని యాత్ర ముగుస్తుంది. భక్తుల కోసం స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్‌లను అందుబాటులో ఉంచారు. భక్తుల ఆర్థిక స్థోమతను దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరలను విభజించారు. రైల్వే అధికారులు భక్తులకు ప్రత్యేక భోజనం, స్నానం, వసతి ఏర్పాట్లు చేశారు. భక్తులకు సులభతరంగా యాత్ర అనుభవం కల్పించేందుకు రైల్ టూరిజం విభాగం నుంచి మార్గదర్శకులు అందుబాటులో ఉంటారు. స్లీపర్ క్లాస్ – ₹14,250 5 నుండి 11 ఏళ్ల చిన్నారులకు – ₹13,240 స్టాండర్డ్ క్లాస్ – ₹21,880 కంఫర్ట్ క్లాస్ – ₹28,440 ఈ రైలు యాత్ర భక్తులకు ఒక మధురమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది. సప్త జ్యోతిర్లింగ దర్శనంతో పాటు అనేక ప్రముఖ దేవాలయాలను సందర్శించే ఈ భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు యాత్ర భక్తుల జీవితంలో ఒక అద్భుత అనుభూతిగా నిలిచిపోతుంది.