తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుండి మార్చి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానుండగా, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కు 4,88,448 మంది, సెకండ్ ఇయర్‌కు 5,08,523 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 1,532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 242 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
గ్రేస్ పీరియడ్
తెలంగాణ ఇంటర్ బోర్డు ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది. పరీక్షా కేంద్రాల్లో గేట్లు పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు మూసివేయాలని నిబంధన ఉన్నప్పటికీ, విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. గతంలో, ఈ నిబంధన కఠినంగా అమలుచేయడంతో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేకపోయారు. గత ఏడాది కూడా ఈ నిబంధన సడలించడంతో ఈ సారి కూడా అదే విధానం కొనసాగించనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.
భద్రతా ఏర్పాట్లు
ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించినట్లు బోర్డు వెల్లడించింది. ఇది విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాన్ని సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 విధానం అమలులో ఉండనుంది. ప్రతి పరీక్షా కేంద్రంలో మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిరంతర నిఘా పెట్టనున్నారు. పరీక్షా పత్రాలు ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయి.

భారీ ఏర్పాట్లు
పరీక్షల పర్యవేక్షణకు 1,532 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 29,992 మంది ఇన్విజిలేటర్లు, 72 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు, 124 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ నియమితులయ్యారు. అవకతవకలు జరుగకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
తదుపరి చర్యలు
విద్యార్థులకు పరీక్షల గురించి ఎటువంటి సందేహాలైనా ఉంటే 92402 05555 టోల్ ఫ్రీ నంబర్‌తో పాటు, జిల్లా కంట్రోల్ రూమ్ ఇన్‌చార్జ్ నంబర్లను సంప్రదించాలని ఇంటర్ బోర్డు సూచించింది.ఈసారి పరీక్షల నిర్వహణలో సాంకేతిక ఆధునికతను వినియోగించడం, భద్రతా చర్యలు పెంచడం విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరింత భరోసా కలిగించనుంది.
నిమిషం నిబంధన
ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన ఎప్పటి నుంచో అమలవుతుంది. ఈ నిబంధన కారణంగా గతంలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులు త్రుటిలో అవకాశాలు చేజార్చుకున్నారు. గత ఏడాది (2024) మార్చిలో జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు తొలిరోజే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకోవడంతో సదరు విద్యార్థిని పరీక్షకు అనుమతించలేదు. దీంతో ఆ విద్యార్ధి అదే రోజు ఆత్మహత్యకు పాల్పడటం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. దీంతో గత ఏడాది నుంచి నిమిషం నిబంధన ఎత్తివేశారు. ఈ సారి కూడా దీనిని అమలు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.