వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక సాక్షులు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు అనుమానాస్పదరీతిలో చనిపోవడం మరో సంచలనంగా మారింది.ఈ మరణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.
వివేకానంద రెడ్డి హత్య
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. 2019 మార్చి 15న తెల్లవారుజామున పులివెందులలోని తన స్వగృహంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన వివేకా హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. బాత్రూంలో జారిపడి మరణించారని, గుండెపోటుతో చనిపోయారని తొలుత ప్రచారం జరిగినా, మృతదేహంపై గాయాల ఆనవాళ్లు ఉండడంతో వివేకాది హత్య అని సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.తర్వాత దీనిని హత్య కేసుగా మార్చి దర్యాఫ్తు ముమ్మరం చేశారు.ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగానే, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మరణించడం మరింత గందరగోళానికి దారితీసింది. వివేకా హత్య జరిగిన ఐదేళ్లలో నలుగురు వ్యక్తులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, వివేకా ఇంట్లో వాచ్‌మన్‌గా పని చేసిన రంగన్న కూడా అనుమానాస్పదంగా మృతి చెందారు.

నారాయణ యాదవ్ (డ్రైవర్)
వివేకా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్, ఆయన భార్య భారతిలను హైదరాబాద్ నుంచి పులివెందులకు తీసుకొచ్చిన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబరులో మరణించారు. అయితే ఆయన మరణానికి అనారోగ్యమే కారణమని భావించారు. అయితే జగన్, భారతి ప్రయాణ సమయంలో జరిగిన ఫోన్ సంభాషణలు విన్నారని, విచారణకు పిలిచేలోపే ఆయన మృతి చెందారని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
రంగన్న (వాచ్‌మన్)
వివేకా హత్య కేసులో వాచ్‌మన్ రంగన్న ప్రధాన సాక్షిగా ఉన్నారు. హంతకులను ప్రత్యక్షంగా చూసిన ఆయన సీబీఐకే కాకుండా మేజిస్ట్రేట్ ముందూ వాంగ్మూలం ఇచ్చారు. ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర రెడ్డి హత్యలో ప్రమేయముందని వెల్లడించారు. రంగన్న ఇటీవల అనారోగ్యానికి గురయ్యారని, చికిత్స పొందుతూ మరణించారని చెబుతున్నా, ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కల్లూరు గంగాధర్ రెడ్డి (కీలక సాక్షి)
వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా 2022లో సీబీఐ పులివెందులలో వివిధ ప్రదేశాల్లో పులివెందులలోని జగన్ క్యాంపు ఆఫీసు, వివేకానందరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి ఇళ్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో కొలతలు, గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకున్నారు. ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్ రెడ్డి అనుమానాస్పదంగా మరణించారు. ఆయన అనారోగ్యంతో చనిపోయారని తెలిపినా, హత్య కేసులో లొంగిపోతే రూ.10 కోట్లు ఇస్తామన్న ఒప్పందాన్ని తిరస్కరించారు, 2021 అక్టోబరు 2న గంగాధర్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత మాట మార్చి బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారని అనంతపురం ఎస్పీకి సీబీఐపై గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు.ఆ తర్వాత ఆయన మృతి చెందినట్లు సమాచారం.
కటికరెడ్డి శ్రీనివాసుల రెడ్డి (అనుమానితుడు)
వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కటికరెడ్డి శ్రీనివాసుల రెడ్డి 2019 సెప్టెంబరులో మరణించారు. తొలుత అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతుండగా,పోస్ట్‌మార్టం రిపోర్టులో కాలేయం, కిడ్నీ మధ్య భాగంలో రక్తపు గాయాలు ఉన్నట్లు తేలింది.
వైఎస్ అభిషేక్ రెడ్డి (డాక్టర్, కీలక సాక్షి)
వివేకా మరణించిన వెంటనే అతని మృతదేహాన్ని పరిశీలించిన వైఎస్ అభిషేక్ రెడ్డి హత్య జరిగిందని భావించినట్లు సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం అనారోగ్యం పాలైన అభిషేక్ రెడ్డి 2024 జనవరిలో మరణించారు.
ఈసీ గంగిరెడ్డి (వైఎస్ భారతి తండ్రి)
వివేకా హత్య కేసుకు సంబంధించి కీలకమైన సమాచారం తెలిసిన వ్యక్తిగా భావించిన ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబరులో మరణించారు. గంగిరెడ్డి ఆసుపత్రిలో మృతదేహానికి బ్యాండేజీలు చుట్టారని, హంతకులు అక్కడే చేతులు శుభ్రం చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రచారం నేపథ్యంలో ఈసీ గంగిరెడ్డి మరణంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.